రియో ఒలింపిక్స్ నుండి సింధూ వెండి పతకంతో మాత్రమే వచ్చింది. కానీ సొంత దేశానికి చేరుకున్నాక సింధూకు బంగారు పంట పండుతుంది. ఒలింపిక్స్ లో వెండి పతకాన్ని కైవసం చేసుకొని బారత్ తిరిగి వచ్చిన సింధూకు భారత ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు, ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ భారీ నగదును అందించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సింధూకు కార్పోరేట్ కంపెనీలు భారీ ఎత్తున ఆఫర్లను చూపుతున్నారు. ఒలింపిక్స్ లో సక్సెస్ సాధించిన సింధూను కార్పోరేట్ కంపెనీలు ఇమేజ్ గా మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ కంపెనీలో తయారయ్యే రకరకాల ఉత్పత్తులకు సింధూను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు ఆయా కంపెనీలు డీల్ కుదుర్చుకుంటున్నాయి.
కానీ ఇప్పటివరకు క్రీడాకారులైన క్రికెటర్స్ తో భారీ ఒప్పందాలను ఆయా కంపెనీలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా బేస్ లైన్ అనే కంపెనీ సింధూతో ఓ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాదాపు రూ. 50 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ కంపెనీనే కాకుండా మరో 9 కంపెనీలతో సింధూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నదని బేస్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ మిశ్రా వివరించాడు. మహిళలకు సంబంధించిన పలు ఉత్పత్తులకు, స్పోర్ట్స్ బ్రాండ్స్ కోసమని పలు కంపెనీలు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో సోనియా, సైనాలను సింధూ మించిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.