ఈ మధ్య టీవీ ఛానెల్స్ లో మధ్యాహ్నం 12 అయ్యిందంటే చాలు అభాగ్యుల బ్రతుకులని బాగు చేసే ప్రోగ్రామ్స్ ఎక్కువై పోయాయి. మీ బతుకుల్ని బాగు చేస్తామని చెప్పి వారిని తీసుకొచ్చి వీళ్ళు.... ఒక ఛానెల్ లో 'బతుకు జట్కాబండి' అంటారు. మరో ఛానెల్ లో 'రచ్చబండ' అంటారు. ఇక ఇంకో ఛానెల్ లో 'సంసారం ఒక చదరంగం' అంటూ ప్రముఖ నటీ నటులతో షో లు చేపించేస్తున్నారు. మరి అసలు ఇవి నిజమైన కష్టాల లేక... అనేది మాత్రం ఎవరికీ తెలీదు. అసలు వారిని చూస్తుంటే నిజం గానే వీరి బ్రతుకుల్ని బాగు చెయ్యడానికి ఛానెల్స్ వారు ప్రయత్నిస్తున్నారని గొప్పగా అనుకుంటారు చాలామంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు లేదా మరికొంత అబద్దం కావచ్చు. కానీ ఈ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా నిర్వహించే నటీమణులు మాత్రం వాళ్ళ వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కోపాన్ని ప్రోగ్రాం కి వచ్చిన వారిపై చూపించేస్తున్నారు. అసలు ఇలాంటి వాటికి వ్యాఖ్యాతగా వచ్చే వారు చాలా ఓర్పుగా... సహనం తో సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చెయ్యాలి. కానీ కొన్ని విషయాలలో వీరు అలా ప్రవర్తించరు.
ఇక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ గురించి ఒక విషయం బయటికి వచ్చింది అదేమిటంటే... జీ తెలుగు ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న 'బతుకు జట్కాబండి' గురించి ఆ న్యూస్. ఈ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా జీవిత గురించి అందరికి తెలుసు. అసలు ముందు ఇలాంటి షో ని మొదలు పెట్టింది జీ తెలుగే. ఈ షో మొదలెట్టినప్పుడు వ్యాఖ్యాతగా సుమలత చేసేది. ఇక తర్వాత వచ్చిన 'బతుకు జట్కాబండి 2వ పార్ట్' నుండి జీవిత ఈ ప్రోగ్రాం ని హ్యాండిల్ చేస్తుంది. ఇంతకీ అసలు విషయమేమిటంటే ఈ ప్రోగ్రాం కి రావాలని కొంతమంది ఒక వ్యక్తిని బెదిరించారని అంటున్నారు. అసలేం జరిగిందంటే అనారోగ్యం గా వున్న ఒకామె తన భర్త తనని వదిలెయ్యగా ఈమె 'బతుకు జట్కాబండి'ని ఆశ్రయించగా... ఆమెని ఆమె భర్తని కలపాలని నిర్ణయించి ఆమె భర్తకి ఫోన్ చెయ్యగా అతను రానని చెప్పాడట. అతను రాకపోతే ఒక ఎపిసోడ్ వెస్ట్ అవుతుందని అనుకున్నారేమో అందుకే జీవిత అసిస్టెంట్ ఆమె భర్తకి బతుకు జట్కాబండికి రావాల్సిందిగా ఫోన్ చేసి బెదిరించాడని సదరు భర్తగారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడట. ఇంకా మా తమ్ముడిని కూడా బెదిరించారని అతను పోలీస్ లకు చెప్పాడట. అంతే కాకుండా వారు బెదిరించిన మాటలను రికార్డు చేసి సాక్ష్యం గా పోలీసులకు ఇచ్చాడని చెబుతున్నారు.
మరి అంతగా బెదిరించి ప్రోగ్రాం కి రప్పించాలా... ఇది జీవితకు తెలిసే జరిగిందా లేక ఆమెకు తెలియకుండా అతని అసిస్టెంట్ ఇదంతా చేశాడా అనేది జీవిత చెబితేనే బావుంటుంది లేకుంటే జీవితా ని కూడా తప్పుగా అనుకునే అవకాశం ఎంతైనా వుంది.