నాగార్జున గెస్ట్ రోల్ లో కనిపించి... నిర్మించిన సినిమా 'నిర్మలా కాన్వెంట్'. ఈ సినిమాలో శ్రీకాంత్ - ఊహల కొడుకు రోషన్ హీరోగా పరిచయమయ్యాడు. రోషన్ కి జోడిగా శ్రియా శర్మ నటించిన ఈ సినిమాలో... నాగార్జున ఒక పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర నుండి నెగెటివ్ టాక్ తో, కలెక్షన్స్ కూడా పెద్దగా లేకుండా రన్ అవుతుంది. అంత పెద్ద హీరో గెస్ట్ రోల్ చేసినప్పటికీ... ఈ సినిమా నిర్మాతగా అన్ని విషయాలు తానే దగ్గరుండి చూసుకున్నా కూడా ఈ సినిమా విజయాన్ని అందుకోలేక పోయింది. అసలు ఈ కథ చాలా పాత కథ, రొటీన్ కథ అని... ఇలాంటి లవ్ స్టోరీస్ ఇప్పటికే చాలా వచ్చేశాయని... ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన అమ్మాయి ఏమిలేని కుర్రాడిని ప్రేమించడం అనేది చాలా సినిమాల్లో చూసేశామని అందుకే దీనిని ప్రేక్షకులు తిప్పికొట్టారనే కామెంట్స్ వెల్లువలా వచ్చాయి.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలని అంటున్నారు అంతా... అదేమిటంటే నాగార్జున గెస్ట్ రోల్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయని... అందుకే ఈ సినిమా కూడా ఇలా అయ్యిందనే టాక్ ఇప్పుడు ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అదెలా అంటారా... నాగార్జున గెస్ట్ రోల్ చేసిన సినిమాలు ఒకసారి లుక్కెయ్యండి. భూమిక మీద అభిమానం తో నాగార్జున 'తకిట తకిట' సినిమాలో మెరిశాడు. ఆ సినిమా భారీ ప్లాప్ ని మూటగట్టుకుంది. ఇక 'జగద్గురు ఆదిశంకర' లో కూడా గెస్ట్ రోల్ చెయ్యగా అదికాస్తా సోదిలోకి లేకుండా పోయింది. ఇక తర్వాత లక్ష్మి మంచు తీసిన 'దొంగాట'లో, మంచు విష్ణు తో చేసిన 'కృష్ణార్జున', అనుష్క హీరోయిన్ గా చేసిన 'సైజు జీరో' లో గెస్ట్ రోల్ చేసిన నాగార్జునకు ఈ సినిమాలు భారీ ప్లాప్ ని తెచ్చిపెట్టాయి. అవన్నీ ఒక ఎత్తైతే ఆయన కొడుకుని భారీగా లాంచ్ చేసిన 'అఖిల్' సినిమాలో కూడా నాగార్జున తళుక్కున మెరిశాడు. ఇక ఆ సినిమా ప్లాప్ గురించి మీకు వేరే చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన 'నిర్మలా కాన్వెంట్' లో నటించాడు. ఆ సినిమా కూడా ప్లాప్ దిశగా పరుగులు పెడుతోంది.
అంటే నాగార్జునకి గెస్ట్ రోల్ కలిసి రావడం లేదని ఈ సినిమాలు చూస్తుంటే అర్ధమై పోతుంది. ఇక ఇప్పటికైనా గెస్ట్ రోల్ చేయాలనుకున్నప్పుడు నాగార్జున తప్పకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని అందరూ సలహాలు ఇస్తున్నారు.