కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేశాడు. అధికారం కోసం ఓట్లు అడుక్కునే సమయంలో తాను ఇచ్చిన మాట ప్రకారమే తాము ఉద్యమాన్ని చేస్తున్నామని ఆ రకంగా అప్పట్లో ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోవాల్సిందేనని అంతవరకు తమ పోరాటం సాగుతుందని ముద్రగడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశాడు.
తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ, చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాసి దాన్ని విడుదల చేశాడు. మీరే ఇచ్చిన హామీని, మీరు కాపులకు కలిగించిన భావాన్ని నెరవేర్చుకొనేందుకు పాటు పడాలని ఆయన అన్నాడు. తాము ఇప్పుడు చేసేవి దొంగ దీక్షలంటున్న మీరు, అధికారంలో లేని సమయంలో మీరు చేసిన దీక్షలను మేమేమనాలో ఒక్కసారి ఆలోచించుకోండని ముద్రగడ బాబును హెచ్చరించాడు.
ముద్రగడ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకోసం బాబు దీక్ష చేయాలని తాము అందుకు సిద్ధంగా ఉన్నమన్నాడు. బాబుకు దమ్ము, ధైర్యం ఉండే హోదా కోసం దీక్ష చేయడానికి తేదీ స్థలం ప్రకటించండి, తాము ఎల్లప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముద్రగడ బాబుకు సవాల్ విసిరాడు. ఇంకా ముద్రగడ మాట్లాడుతూ కాపులకు బీసీలలో చేర్చుతామంటూ కాపులకు ఆశ కల్పించిందీ బాబుగారేనని, అందుకోసమే తాము సిగ్గు, లజ్జా అన్నీ వదిలేసి ఉద్యమంలోకి దూకుతున్నామని ఆయన వివరించాడు.