తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత నాలుగు రోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హైఫీవర్, డీహైడ్రేషన్‌తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను మెరుగైన చికిత్సను అందించడం కోసం సింగపూర్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జయలలితకు మధుమేహం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా జయలలితకు కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఉందని దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన చికిత్స కోసం జయలలితను సింగపూర్ పంపిస్తున్నట్లుగా అపోలో ఆస్పత్రి వైద్యాధికారులు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జయలలితకు జ్వరం తగ్గింది గానీ, ఇంకా పూర్తిగా కోలుకొనేందుకు సమయం పడుతుందని, అందుకోసం అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా జయలలిత త్వరితగతిన కోలుకొని సాధారణ స్థాయిలోకి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం జ్వరం మాత్రం తగ్గిందని, దాంతో జయలలితకు సాధారణమైన ఆహారం తీసుకుంటుందని అపోలో ఆస్పత్రి వైద్యబృందం ఓ ప్రకటనలో తెలియజేసింది.
అయితే జయలలితకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే అపోలో ఆస్పత్రి వద్దకు పలువురు మంత్రులు, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. విచిత్రమేమంటే జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా జయలలితకు బొకే పంపించారు. అందుకు ఆమె కృతజ్ఞతా పూర్వక లేఖ కూడా రాసింది. అంతేకాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళన కలిగించే అంశమనీ, ఆమె త్వరగా కోలుకొని సాధారణ స్థితిలోకి రావాలని కోరుకుంటునట్లు తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నాడు.