ప్రతి ఏడాది జరిగే ఆస్కార్ ఫిలిం అవార్డ్స్‌లో భాగంగా ఫారిన్ కేటగరి విభాగంలో భారత్ తరపున కూడా ఓ చిత్రాన్ని ఎంపిక చేసి పంపుతారు. ఈ బాధ్యతను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. ఈ సంవత్సరం ఈ కేటగరిలోకి తమిళ చిత్రం 'విశారణై' అనే తమిళ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేతన్‌మెహతా ప్రకటించారు. ఓ ఆటోడ్రైవర్ తన స్వీయ అనుభవాలతో రచించిన 'లిప్‌లాక్' అనే నవల ఆధారంగా దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ నటుడు ధనుష్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో పోలీసుల అకృత్యాలు, లంచగొండితనం, న్యాయం ఓడిపోవడం వంటి పలు అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. 2016 ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల రివార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. ఈ చిత్రం జాతీయ అవార్డును పొందడంతో పాటు 72వ వెనిస్ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది.