కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన 'విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు' అన్న పుస్తకంపై మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మండిపడ్డాడు. విభజనకు మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ భాజపా ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్నాడని ఉండవల్లి పుస్తకంలో రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఉండవల్లి రాసిన పుస్తకంలో కొన్ని ఊహాజనిత కథనాలు ఉన్నాయని, విషయాన్ని అలా జరిగి ఉండవచ్చు అని ఊహించుకొని రాయడం జరిగిందని, అది వాస్తవ విరుద్ధంగా ఉందని జైపాల్ రెడ్డి అన్నాడు. ఎవరైనా భావి తరాలకు చరిత్రను తెలపాలనుకున్నప్పుడు ఊహలకు, గాలిపోగుచేసి రాసే అంశాలకు ప్రధాన్యత ఇవ్వకూడదని, నిజంగా తెలిస్తేనే చరిత్ర రాయాలన్న తలంపు రావాలని ఆయన వ్యాఖ్యానించాడు.
పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రసారాలు నిలిపివేశాడని రాశాడు. హౌస్ ప్రసారాలను నిలిపివేయడానికి, విభజన బిల్లు ఆమోదం పొందడానికి పొంతనే లేదని జైపాల్ రెడ్డి వెల్లడించాడు. కాగా హౌస్ ప్రసారాలు నిలిపివేయమని స్పీకర్ కు తాను సలహా ఇచ్చినట్లుగా ఉండవల్లి రాశాడని, తాను అలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని జైపాల్ వివరించాడు. బహుశ హౌస్ ప్రసారాలు నిలిచిపోవడానికి పెప్పర్ స్ప్రే కారణమై ఉంటుందని ఆయన తెలిపాడు. అంతేగానీ తాను ఎటువంటి సలహాలు స్పీకర్ కు ఇవ్వలేదన్నాడు. స్పీకర్ తన సలహాలు తీసుకొని ఆచరించేటంత అవకాశం ఉండదని, హౌస్ ప్రసారాలు నిలిపివేయాలా? వద్దా? అన్నది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నాడు.
ఇంకా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అరుణ్ కుమార్ పుస్తకంలో పొన్నం ప్రభాకర్ భాజపా ఎంపీ సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్నాడని రాశాడు. అటువంటిదేం అక్కడ జరగలేదని జైపాల్ చెప్పాడు. విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు భాజపా ఎంపీలు సుష్మాస్వరాజ్, ఎల్కే అద్వానీ అంతా లేచి నిలబడ్డారు గానీ పొన్నం ప్రభాకర్ సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్నాడని చెప్పిన ఉదంతాన్ని ఉండవల్లి అల్లిన కట్టుకథగా జైపాల్ కొట్టిపారేశాడు. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ కు స్పీకర్ చాంబర్ లో ఏం జరిగిందో తెలియదని, ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలియదని ఆయన అన్నాడు. సుష్మ స్వరాజ్ విభజన బిల్లు ప్రవేశ పెడితే మద్దతిస్తాన్నది అంతేగానీ అక్కడేం జరగలేదని, ఆ తర్వాత విభజన బిల్లు పాస్ అయ్యింది అని అన్నాడు. కాగా విభజన బిల్లు పాస్ కావడానికి జైపాల్ కీలక పాత్ర పోషించాడని ఉండవల్లి రాశాడు. ఇదొక్క విషయం మాత్రం నిజమని జైపాల్ రెడ్డి తెలిపాడు.