కావేరి వివాదం మరోసారి రాజుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కావేరి జలాలు తమిళనాడుకు ఈ నెల 27వ తేదీ వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కులు విడుదల చేయాలని సుప్రీంకోర్టు మరోసారి తెలిపిన నేపథ్యంలో మళ్ళీ ఆందోళనలు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య ప్రాంతానికి చెందిన ప్రజలు రోడ్లమీదకు వచ్చి కావేరి జలాలతో నిరసన తెలుపుతూ ఉరి వేసుకుంటున్నట్లుగా ఆ ప్రాంత ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అదే సందర్భంలో మాండ్యా ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఎంపీలు కూడానూ రాజీనామా బాట పడ్డారు. ఆ ప్రాంత ప్రజల ఆందోళనను బట్టి ప్రజాప్రతినిధులు కూడా ప్రజల పక్షాన వారికి బాసటగా నిలబడ్డారు. మరోపక్క కావేరి జలాలు పారే కర్ణాటకలోని అన్నీ ప్రాంతాలలో ప్రభుత్వ బలగాలు భారీగా మోహరించాయి. అలాగే కర్ణాటక హోమంత్రి కూడానూ ప్రజలంతా శాంతియుతంగా సంయమనం పాటించాలని కోరాడు.
కావేరి జలాలు పారే మాండ్య ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నోటికి గుడ్డ కట్టుకొని నిరసన ప్రదర్శనలు ఇచ్చారు. బెంగుళూరులో కూడా ఉద్రక్తపరిస్థితులు నెలకొనే అవకాసం ఎక్కువగా ఉన్నందున పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కాగా పర్యవేక్షణ కమిటీ సూచన ప్రకారం 3వేల క్యూసెక్కులు మాత్రమే వదలాలి. కానీ సుప్రీంకోర్టు సూచించిన తీర్పు ప్రకారం 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తెలిపింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతూ సుప్రీం తీర్పు ప్రకారం నీళ్ళు వదలడం చాలా కష్టంతో కూడుకున్న విషయం అనీ, అసలు నీళ్ళే లేకపోతే అన్ని నీళ్ళు ఎలా విడుదల చేయాలని ఆయన విలేకరులకు తెలిపాడు. ఇదిలా ఉండగా నీరు విడుదల చేసే చోట కూడా కట్టదిట్టమైన భద్రత ఉంచాలని కర్ణాటక హోంమంత్రి ఆదేశాలు జారీ చేశాడు.