ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బదులు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడాన్ని తమ ఘనతగా కాలరెగరేసుకుంటున్న అధికార పార్టీపై వైకాపా మండిపడుతుంది. అధికార పక్షం తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతుంది. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెదేపా తీరును ఎండగట్టాడు. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడి, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్యాకేజీ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించాడు. ఏపీకి పెద్ద ఎత్తున ప్రత్యేక ప్యాకేజి అంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వివరించాడు. మిగతా రాష్ట్రాల వలెనే ఏపీకి బడ్జెట్ లాంటిది వచ్చిందే తప్ప ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏమీ లేదని, కేంద్రం నుండి అదనంగా ఒక్క పైసా రాలేదని విజయసాయి తెలిపాడు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబుతో బహిరంగచర్చకు సిద్ధమా అనిఆయన సవాల్ విసిరాడు. తాను కేసులకు భయపడే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. మొత్తానికి విజయసాయి కేసులపై భయపడేది లేదంటూ తెలిపేశాడు.