రక్త చరిత్ర సినిమాతో వివేక్ ఒబరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. వివేక్ సమాజానికి సేవ చేయాలన్న తలంపు ఎక్కువగా ఉందన్న విషయం మరోసారి ఋజువు చేయబోతున్నాడు. అప్పట్లో కర్నూలు వరదల్లో మునిగిపోయినప్పుడు తను భారీ స్థాయిలో విరాళాన్ని అందించాడు. అలా ముంబైలో పలు రకాల కార్యక్రమాలు నడుపుతున్నాడు. ప్రస్తుతం ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును చేపట్టి పేదవారికి, తక్కువ ఆదాయం వస్తున్న వారికి అతి తక్కువ ధరకు ఇల్లు కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమం చేసే ఆలోచనలో మునిగిపోయాడు.
ప్రధాని నరేంద్ర మోడి సంకల్పంతో ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలన్న తలంపుతో వివేక్ ఒబరాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2022 నాటికి ప్రతిఒక్కరికీ ఇల్లు ఉండాలన్నదే మోడీ సంకల్పం. మోడీ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న వివేక్ ఈ యేడాది చివరి నాటికి 5 లక్షల ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు మహారాష్ట్రలోని 360 ప్రాంతాలను ఎంచుకొని ఆయా ప్రాంతాలలో ఇండ్ల నిర్మాణం జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక్కో ఇంటిని 790000 రూపాయలుగా నిర్మించి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపాడు. కాగా ప్రభుత్వం నుండి ఏ ఒక్కసెంటు భూమిని తీసుకోవడం లేదని, మొత్తం ప్రైవేటు వ్యక్తుల నుండే సేకరిస్తున్నట్లు వెల్లడించాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో తనకు పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి ఇప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలలో కూడా ఇదే పద్ధతిలో తన సేవలు కొనసాగిస్తానంటూ తన ఉదార గుణాన్ని చాటుకుంటున్నాడు వివేక్.