మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చాలా ముక్కు సూటిగా వ్యవహరిస్తాడు. అందుకనే సినీ పెద్దలు మోహన్ బాబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఆచితూచి మాట్లాడుతుంటారు. ఆయన విషయంలోగానీ, పరిశ్రమ విషయాల్లో గానీ ఎవరు తప్పు చేసినా తనదైన శైలిలో వారిపై విరుచుకు పడటం మోహన్ బాబు నైజం. ఎంతటి వారినైనా మోహన్ బాబు నిలదీసి కడిగి పారేస్తుంటాడు.
తాజాగా మోహన్ బాబు స్పందిస్తూ టాలీవుడ్ నిర్మాతలపై ఓ రేంజ్ లో వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో బడ్జెట్ విపరీతంగా పెరగడానికి కారణం నిర్మాతలేనంటూ బాంబు పేల్చేశాడు మోహన్ బాబు. ఒక్కో సినిమాకు నిర్మాతలు హీరో, హీరోయిన్లు, దర్శకుల వెంట పడి మాకు సినిమా చేసి పెట్టండి అంటూ చిల్లరగా బ్రతిమిలాడుకోవడం మూలంగా వారికి డిమాండ్ పెరుగుతుంది. అటువంటప్పుడు వాళ్ళు అడిగిన మొత్తానికి నిర్మాతలు ఒప్పేసుకోవడం మూలంగా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుందని మోహన్ బాబు అన్నాడు. అసలు రూ.50 లక్షల ఇవ్వాల్సిన దర్శకుడికి రెండు కోట్లు ఇస్తుండటం, ఇతర కారణాల మూలంగా విపరీతంగా సినిమాకు వృధా ఖర్చు అవుతుందని మోహన్ బాబు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
అదే సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. సినిమా ఏమాత్రం ఆడకపోతే దెబ్బతినేది మళ్ళీ నిర్మాతలేనని ఆయన వెల్లడించాడు. ఆ మాత్రం తెలుసుకోలేని ఓ రకమైన మత్తులో మన నిర్మాతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు తంటాలంతా బినామీ నిర్మాతల వల్లనే వస్తుందని, వీళ్ళ కారణంగా నిజమైన నిర్మాతల పరువు పోతుందని ఆయన అభిప్రాయ పడ్డాడు. ముఖ్యంగా నిర్మాతలు ఎప్పుడైతే మారతారో, అప్పుడే పరిశ్రమలో మార్పు దానికంతట అదే వస్తుందని తెలిపాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... సినిమా వసూళ్ళ విషయంలో చెప్తున్న లెక్కలు దొంగ లెక్కలనీ, అవన్నీ ఆధార రహతమేనని అసలు గుట్టు బయటపెట్టాడు మోహన్ బాబు. వాస్తవ విరుద్ధమైన లెక్కలు వెల్లడించడం శోచనీయం అన్నాడు మోహన్ బాబు.