తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రరాష్ట్రం తరఫున పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు వెంకయ్యనాయుడు. ఆ రకంగా కేంద్రంతో నిరంతరం ఏపీ తరఫున మంతనాలు జరుపుతున్నాడు. రాజ్యసభ సాక్షిగా విభజన బిల్లు జరుగుతున్న సమయంలో చెయ్యెత్తి పది వేళ్ళు చూపిస్తూ పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగినప్పడు ఏపీ ప్రజలకు వెంకయ్యనాయుడు దేవుడిలా దర్శనమిచ్చాడు. అప్పుడు ప్రజలంతా ఆయన్ని గుండెలకు హత్తుకున్నారు. కానీ పరిస్థితుల కారణంగానో, లేకా పార్టీ ప్రభావాలు వల్లనో గానీ, అధికారం అందగానే మాట నిలకడ, లక్ష్యం దిశగా పోరాటం జరపడం లేదు సరికదా అందుకు విరుద్ధమైన మాటలు వారి నోటి నుండి వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వెంకయ్య నాయుడే స్వయంగా ఏపీకి హోదా వేస్ట్, ప్యాకేజీనే బెస్ట్ అంటున్నాడు.
విజయవాడలో జరిగిన ప్యాకేజీ అవగాహనా సదస్సులో భాగంగా ఆయన మాట్లాడుతూ.... ‘విడిపోయే సమయంలో ఏపీకి న్యాయం చేసే నిమిత్తం హోదా మాట నేనే ఎత్తాను. కానీ మారిన పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడు చూసుకుంటే హోదాకంటే ప్యాకేజీయే బెస్ట్ అనిపిస్తుంది’ అంటూ వెల్లడించాడు. ఒక్క హోదాతోనే అయితే ఆంధ్రాకు 4,000 కోట్లు మాత్రమే అందుతాయి. అదే ప్యాకేజీనే అయితే 2.25 లక్షల కోట్లకు మించి లబ్ది చేకూరుతుందని ఆయన వివరించాడు. కాబట్టి ఇదే చాలా ఉత్తమంగా అనిపిస్తుందన్నాడు వెంకయ్య నాయుడు. పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులు కూడాను హోదా కంటే ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలు, వనరులు, ముందు ముందు అక్కడ జరగబోయే అభివృద్ధిని చూసే ముందుకు వస్తున్నారని ఫ్యాకేజీపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు వెంకయ్య నాయుడు.