బుల్లితెర స్టార్ అంటూ ఊదరగొట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సిద్ధార్థ' ఫలితాన్ని ప్రేక్షకుల కంటే ముందే ఎగ్జిబిటర్లు ఊహించారు. అందుకే ఈ సినిమా కోసం నైజాంలో ఇచ్చిన థియేటర్లను కేవలం ఏడు రోజులకే పరిమితం చేయడం విశేషం. 16న సిద్ధార్థ రిలీజ్ అవగా, 23న నాని నటిస్తున్న మజ్ను కోసం అవే థియేటర్లను కేటాయించారు. దీనర్ధం సిధ్దార్థకు ఆదరణ ఉండదని భావించడమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
బుల్లితెరపై ఆర్.కె.నాయుడు, మున్నాగా పేరున్న సాగర్ (38) లేట్ వయసులో హీరోగా ప్రయత్నాలు చేశాడు. నిజానికి ఆయన నటించిన తొలి చిత్రం 2013లోనే మొదలైంది. అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. టైటిల్ 'మేన్ ఆఫ్ ది మ్యాచ్'. నిక్కుతూ, నీలుగుతూ రెండేళ్ళు షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం ద్వారానే రాశి పునః ప్రవేశం చేసింది. రాజేంద్రప్రసాద్ మరో పాత్ర చేశాడు. ఫ్లాష్‌బ్యాక్ మరిచి బుల్లితెర స్టార్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం అంటూ 'సిద్ధార్థ' గురించి ప్రచారం చేస్తుండడం గమనార్హం.
పాత రివేంజ్ ఫార్ములాతో తీసిన సిద్ధార్థకు రెండు రాష్ట్రాల్లో ఓపనింగ్స్ కరువయ్యాయి. దాంతో ఆఘమేఘాల మీద 24 గంటల్లోనే సక్సెస్ మీట్ పెట్టి విజయంపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రిలీజ్‌కు ముందు 'సిద్ధార్థ' చిత్రం కోసం ఇంటర్య్వూల మేళ నిర్వహించారు. ప్రతి రోజు యూనిట్‌లోని ఎవరో ఒకరి ప్రెస్‌మీట్ పెట్టి ఉదరగొట్టారు. అప్పుడే చాలామందికి సినిమాలో అసలు విషయం లేదనే డౌట్ వచ్చింది. అదే నిజమైంది