ఆ రోజుల్లో ఫలానా సినిమా ఇన్ని కేంద్రాలలో శత దినోత్సవం, ఇన్ని కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకునేది అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి నేటి సినిమాది. అందుకు కారణం ఉంది, ఎందుకంటే ఇప్పటి సినిమాల్లో ఏ ఒక్కటీ ఆ విధంగా ప్రదర్శింపబడుతున్న దాఖలాలు మనకు కనిపించకపోవడంతో ఇలాంటి బడాయి మాటలు వల్లించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇన్ని కేంద్రాలలో ఇన్ని రోజులకు బదులు రూటు మార్చి, ఈ ఈ సెంటర్లలో ఇంత కలెక్షన్ చేసి ఇంత వసూలు చేసింది అన్న లెక్కలను మాత్రమే చెప్తున్నారు. ఆ రకంగా సినిమా హిట్టా ఫట్టా అన్న విషయం కూడా తేల్చేస్తున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలవలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒక్క 50 రోజుల పోస్టర్ పడటం అన్నది నేటి సినిమా కాలంలో గగనంగా మారిపోయింది. కాగా తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 50 రోజులు ఆడటం చాలా చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటే అలాంటిది అమెరికాలో ఒక్క తెలుగు సినిమా ఏకంగా 10 కేంద్రాలలో 50 రోజులు ఆడటం అన్న విషయం వినగానే ఎగిరి గంతేయాల్సిన సమయం.
అలాంటి అరుదైన ఘనత ‘పెళ్లిచూపులు’ సినిమాకు దక్కడం అందరూ అభినందించాల్సి విషయంగా చెప్పవచ్చు. అమెరికా చరిత్రలోనే తెలుగు సినిమా ఇలాంటి అనూహ్యమైన రికార్డు సాధించడం చాలా గొప్ప ఘనతను సాధించడమే. జులై 29వ తేదీన విడుదలైన ఈ సినిమా అమెరికాలో అరుదైన రికార్డు సాధించింది. ఉన్నఫలంగా మిలియన్ క్లబ్బులోకి చేరిపోయింది. అంతటితో ఆగకుండా లాంగ్ రన్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.
కాగా ఇప్పటి వరకు అమెరికాలో ఎంత పెద్ద సినిమా అయినా సరే రెండు మూడు వారాలకు మించి ఆడిన దాఖలాలు లేవు. అలాంటిది ఏకంగా 10 సెంటర్లలో 50 రోజులు ఆడిందంటే మామూలు విషయం కాదంటుంది ఫిల్మ్ సర్కిల్. అయితే ఇప్పటివరకు అమెరికాలోని తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ ‘పెళ్లిచూపులు’ సినిమాకే దక్కిందని చెప్పవచ్చు.