హైదరాబాద్ లో హోరుమనే వర్షంలోనే గణేష్ నిమజ్జనాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. తనకి టాటా చెప్పేందుకే వరుణుడు వచ్చాడా..? అన్నట్లుగా వినాయకుడు నిమజ్జనంకి బయలుదేరాడు. అలాగే బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. బాలాపూర్ వినాయకుడి లడ్డూ ఈ సంవత్సరం మునుపెన్నడూ లేని విధంగా 14 లక్షల 65వేల రూపాయలు పలికింది. వేలం పాట ప్రారంభమైనప్పటి నుండి హోరా హోరీగా సాగిన పాటలో ఆశ్చర్యకరంగా రూ.14.65 లక్షలు పలకడంతో భక్తుల ఉత్కంఠకు తెరపడింది. కాగా వేలంపాటలో స్కైలాబ్ రెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నాడు. పదిలక్షల నుండి ప్రారంభమైన పాట ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.
అయితే బాలాపూర్ లడ్డూపై భక్తులకు ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఈ లడ్డూ కోసమని దాదాపు 25మంది భక్తులు పోటీ పడ్డారు. గత సంవత్సరం వేలంలో పాల్గొన్న 16మందితో పాటు ఈ లడ్డూకోసమని మరో 9మంది అదనంగా కలుపుకొని అంతా 25మంది వరకు వేలంలోపోటీ పడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన వేలంపాట చివరకు గణేష్ లడ్డూను స్కైలాబ్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. గత సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.10.32 లక్షలు పలికింది. ఈ సారి ఆ రికార్డును అధిగమించింది. ఏడాదికేడాది ఈ లడ్డూకి పోటీ పెరుగుతున్నట్లుగా అర్ధమౌతుంది. ఈ సందర్భంగా స్కైలాబ్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తులకు వినాయకునిపై గల నమ్మకమే ముందుకు నడిపిస్తుందన్నారు
బాలాపూర్ లడ్డూకి ప్రపంచంలోనే మంచి క్రేజ్ ఉంది. వినాయక చవితి అంటే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూనే. కాగా బాలాపూర్ వాసులు లడ్డూ వేలంలో వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తారు.