ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్స్‌లో ట్రెండ్‌ను ఫాలో అవుతూ, కేవలం కథాపరమైన చిత్రాలకే ఓటు వేస్తున్న హీరో నాగార్జున. ఈయన ఇమేజ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఆయన నటించిన చిత్రాలు వరస విజయాలు సాధిస్తున్నాయి. కాగా ప్రస్తుతం నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఓం నమో వేంకటేశాయ' అనే భక్తిరస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాగార్జున ఇమేజ్‌కి తోడు రాఘవేంద్రరావు-నాగార్జునల కాంబినేషన్‌పై ఉన్న నమ్మకం, గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అన్నమయ్య, శ్రీరామదాసు' వంటి చిత్రాలు విడుదలై సంచలన విజయాలను సొంతం చేసుకున్న కాంబినేషన్‌తో పాటు తెలుగు ప్రజలు విపరీతంగా ఆరాధించే వేంకటేశ్వరస్వామి భక్తుడు హతీరాంబాబా జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం కావడం వంటి కారణాలతో ఈ చిత్రం విడుదలకు ముందే అద్భుతమైన ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంటోంది. ఓ ప్రముఖ ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్ద ఈ చిత్రం ఓవర్‌సీస్ హక్కులను రూ.6 కోట్లకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.ప్రస్తుత జనరేషన్‌లో నాగార్జున నటిస్తున్న ఓ భక్తిరస చిత్రం విడుదలకు ముందే ఈ రికార్డు ధరకు అమ్ముడుపోవడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది.