కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళ, కన్నడ రాష్ట్రాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నీటి వివాదం కారణంగా ఆ రెండు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ప్రధానంగా బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఆందోళన కారులు అటు బెంగళూరులో తమిళనాడుకు చెందిన ఆస్తులకు నష్టం కలిగించగా, ఇటు చెన్నైలో కూడా భారీ మొత్తంలో కర్నాటకకు చెందిన ఆస్తులకు నష్టం వాటిల్లజేశారు. బెంగుళూరులోనైతే పెద్ద సంఖ్యలో లారీలను, బస్సులను, ఇతర వాహనాలను కన్నడిగులు దగ్ధం చేసి తీవ్ర నష్టానికి గురి చేశారు. కాగా ఈ నేపథ్యంలో కర్నాటకలోని తమిళుల ఆస్తులపై జరిపిన దాడిని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి డిఎండికె పార్టీ అధినేత విజయకాంత్ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించాడు. కాగా తమిళులకు జరిగిన అన్యాయంపై విజయకాంత్ నిరాహార దీక్షకు దిగనున్నట్లు కూడా తెలుస్తుంది.
కాగా ఈ మధ్య కాలంలోనే ఓ తమిళ వ్యక్తిపై కన్నడిగుడు తీవ్రమైన దాడికి తెగబడ్డాడు. ఈ ఇరువురి దాడికి సంబంధించిన వీడియో కూడా యూ ట్యూబ్ లో వైరల్ అయింది. కాగా ఈ విషయాలన్నింటిపై విజయకాంత్ మాట్లాడుతూ...జరిగిన ఘటనను చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించాడు. ఇటువంటి దాడులు కానీ, ఎటువంటి దాడులు, ఆస్తి నష్టం జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపాడు. జరిగిన దాడులను నిరసిస్తూ ఈనెల 16వ తేదీ నుండి చెన్నైలోని కోయంబేడు పార్టీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు కూర్చోనున్నట్లు విజయకాంత్ తెలిపాడు.
అయితే కావేరీ జలాల వివాదం కారణంగా తలెత్తిన ఘర్షణల ద్వారా కర్నాటక భారీ నష్టాన్నే చవిచూసింది. తమిళనాడుకు కావేరీ జలాలను తప్పక విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వందలాది మంది కన్నడిగులు ఆందోళనలు చేస్తూ బెంగళూరు కేంద్రంగా అల్లకల్లోలం సృష్టించారు. భారీ విద్వాంసానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. తమిళనాడుకు చెందిన బస్సులు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. నగరంలోని పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు మూతబడ్డాయి. దీంతో ఒక్క కన్నడ రాష్ట్రానికే రూ.25వేల కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని తాజా సమాచారం.