ప్రస్తుతం కావేరి జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలను అతలాకుతలం చేసేస్తున్న అతి పెద్ద సమస్య. కర్ణాటకలో తమిళులకు, తమిళనాడు లో కన్నడీగులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నేపధ్యం లో తమిళనాడు బస్సులను, లారీలను, మిగతా వాహనాలను కర్ణాటక లో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆందోళనకారులు తగలబెట్టేస్తున్నారు. ఇక బెంగుళూరులో అయితే పరిస్థితి అదుపు తప్పేసింది. అక్కడికి కేంద్రం అదనపు బలగాలను కూడా పంపింది. ఇదే విధంగా కర్ణాటక కు సంబంధించి వాహనాలను కూడా తమిళనాడులో ఇలాగే తగలబెడుతున్నారు. ఇక ఈ వివాదం తమిళ సినీ పరిశ్రమను సైతం తాకింది. ఈ గొడవలు ఆయా సినిమా వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ఆందోళనకారులు... ఎక్కడ సినిమా షూటింగ్ లు జరిగితే అక్కడికి వెళ్లి జై తెలంగాణ అని అనే వరకు ఆయా హీరోల షూటింగ్ లు జరక్కుండా అడ్డుకునేవారు. మళ్ళీ ఇప్పుడు కావేరి జలాల సమస్యలో కూడా సినిమా పరిశ్రమను ఇరికించేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం రజినీకాంత్ వంటి స్టార్స్ ఇళ్ల దగ్గర భద్రత ను కట్టుదిట్టం చేసింది. రజినీకాంత్ జన్మతహా కర్ణాటక ప్రాంతం వాడే కావడంతో తమిళనాడులో అతని పై ఏమన్నా దాడులుకు తెగబడతారేమో అని జయ సర్కారు ముందే భద్రతను పెంచేసింది. ఇంకా ప్రభుదేవా వంటి ప్రముఖుల ఇళ్ల దగ్గర కూడా భద్రతను పెంచింది. అయితే ఇది ముందు జాగ్రత్త చర్యగా భద్రత పెంచామని జయ సర్కార్ చెబుతున్నా.. ఇక్కడ దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వారు చెప్పడం తోనే తమిళనాడు ప్రభుత్వం ఇలా చేస్తుందని సమాచారం. కేవలం కన్నడ ప్రాంత స్టార్స్ ఇంటి దగ్గరే ఈ భద్రతను పెంచినట్టు కోలీవుడ్ మీడియా సమాచారం.