ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను సాధించేందుకు పవన్ మూడంచెల పోరాటాన్ని చేస్తానన్న విషయం తెలిసిందే. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం ప్రధానంగా ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజానాయకుల మీద చేస్తున్నాడు. నాయకులపై పోరాటం చేస్తే ప్రభుత్వంపై చేసినట్లే అన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ దిశగానే తిరుపతి, కాకినాడ సభలు ముఖ్యంగా ఎంపీలే లక్ష్యంగా చేసుకొని సాగినవి. అందులో భాగంగానే ప్రజా ప్రతినిధుల ఇళ్ళ ముట్టడులు, దర్నాలు లాంటివి ప్రజలు చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ మూడు అంచల పోరాటం ఎలా అన్నది చెప్పాడు గానీ, ఎప్పుడెప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు. 9వతేదీ కాకినాడలో సభ అయ్యాక జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాడం చప్పబడిపోయింది. అంతేకాదు ఆ తర్వాత దాని ఊసే వినపడటం లేదు. కొనసాగింపుగా ఆయన జనసేన పార్టీ సభ్యులు కూడా ఎక్కడా పోరాడం కొనసాగిస్తున్నామన్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ మన కార్యకర్తలెవరూ బంద్ ల వంటి వాటిల్లో పాల్గొనకూడదన్న సంకేతాలు కార్యకర్తలకు కాకినాడ సభాముఖంగా ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే పవన్ ఎక్కడైతే సభ పెడతాడో అక్కడే, అప్పుడే వారి పోరాటం జరుగుతుంది, ఆ తర్వాత సాగదన్న విషయం కూడా తేటతెల్లమౌతుంది. ఇలాంటి సుషుప్తావస్థలో నుండి మళ్ళీ జనసేన కాడర్ ను పవన్ కళ్యాణ్ ఎప్పుడు మేల్కొల్పుతాడో తెలియదు. కాగా తాజాగా మరో విషయం కూడా వినపడుతుంది. కాకినాడ సభ తొక్కిసలాట మూలంగా జరిగిన ఒకరి మృతి కారణంగా ఇక బహిరంగ సభలు నిర్వహించకూడదన్న అభిప్రాయానికి కూడా పవన్ వచ్చినట్లు తెలుస్తుంది. అదే నిజమైతే ఇక ఎప్పుడో తప్ప మిగతా కాలం అంతా నిద్రావస్తలోనే ఉండవచ్చు పవన్ జనసేన.
కాగా ఇప్పుడు ఇదే అదునుగా అవకాశంగా భావించిన జగన్ వైకాపాను మేల్కొల్పి కేడర్ ను బలోపేతం చేసేందుకు బంద్ లు, దర్నాలు, ఎంపీ, కేంద్రమంత్రుల ఇల్లు ముట్టడులు వంటివి కూడా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేకహోదా కోసం వైకాపా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. వైకాపా తరఫున బంద్, తర్వాత నిరసన కార్యక్రమాలు జరుపుతూనే ఉంది. ఇందులో భాగంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ఆయా జిల్లాల్లో భారీస్థాయిలో నిరసనలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటిని వైకాపా నేతలు, కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. వైకాపా కార్యకర్తలంతా వెంకయ్యనాయుడు ఇంటి వరకు ర్యాలీ చేశారు. కానీ వారి ఇంటికి చేరుకోకముందే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ తతంగమంతా చూడబోతే జనసేన అధినేత పవన్ ప్రకటించిన మూడంచెల పోరాటం జగన్ వైకాపా నుండి చేసేస్తున్నట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. ఈ సమయంలో పవన్ మేల్కొంటాడా? లేక అలా నిద్రపోయి మెలకువ వచ్చినప్పుడు మాత్రమే మరో సభ పెట్టి చేతులు దులుపుకుంటాడా? చూద్దాం…