కాపు నేత ముద్రగడ పద్మనాభం నిన్న (ఆదివారం) బీఆర్‌కే కళ్యాణ మండపంలో 13 జిల్లాల కాపునేతలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చలు జరిపారు. ఈ చర్చలో ముద్రగడ కన్నీళ్ల పర్యంతమయ్యారు. మమ్మల్ని చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందని... ఒక అనాథలా బ్రతుకుతున్నానని బాధపడ్డారు. ప్రభుత్వం నన్ను నా కుటుంబాన్ని ఎన్ని బాధలు పెట్టినా కూడా నేను కాపు ఉద్యమాన్ని వదిలిపెట్టనని అన్నారు. మమ్మల్ని ఈ ఊరు నుండి తరిమేయాలని ప్రభుత్వం యోచిస్తోందని.... ఊరు నుండే కాదు రాష్ట్రం నుండి తరిమేసినా నా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఇంకా ముద్రగడ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపు ఉద్యమాన్ని అణచాలని చూస్తే సహించమని ముద్రగడ అన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాపు ఉద్యమాన్ని కొందరు అవహేళన చేస్తున్నారని, కాపుల్లో చిచ్చుపెట్టాలని చూడొద్దని అన్నారు. అబద్దపు ప్రచారాలతో మాపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. అంతే కాకుండా నాపై టెర్రరిస్టు ముద్రవేయాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మీకే గనక దమ్ము, ధైర్యం ఉంటే నాకు వ్యతిరేకంగా తునిలాంటి సభ పెట్టండని సవాల్ చేశారు. ఇక ప్రత్యేక హోదా విషయమై మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తే తాము మద్దతు ఇస్తామని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పవన్ ప్రజల్లోకి వచ్చి పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు. పవన్ వల్ల హోదా సాధ్యపడితే ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారని అన్నారు. హోదాను సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ముద్రగడ విమర్శించారు. హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తే నేను కూడా ఆయనతో పాటు నిరాహార దీక్ష చేస్తానని చంద్రబాబుకి హెచ్చరిక జారీ చేశారు. మరి ముద్రగడ సవాల్ ని చంద్రబాబు స్వీకరిస్తాడా లేక ముద్రగడని లెక్కలోకి తీసుకోకుండా ఆయన పని ఆయన చేసుకుపోతాడా..!