తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భం తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్రం తరపున పెద్ద దిక్కుగా వెంకయ్యనాయుడు కేంద్రంతో వ్యవహారాలను చక్కబెట్టాడు. ఆ కీలకమైన సమయంలో పెద్ద మనిషిగా ఉండి అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు వెంకయ్య నాయుడు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలిచాడు వెంకయ్య. ప్రస్తుతం ప్రత్యేక హోదాపై జరుగుతున్న పలు ఉద్యమాలపై వెంకయ్య స్పందిస్తూ హోదా వల్ల ఒనగూడే ప్రయోజనం ఏంటో తెలిపాడు. సహజంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల నిధుల సమీకరణ 60 : 40 గా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకైతే 90:10 గా నిధులు ఉంటాయని వెల్లడించాడు. కానీ విభజన సందర్భంలో ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టమని తాము గట్టిగా పట్టుబడితే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని వెల్లడించాడు.
కాగా ఇప్పుడు భాజపాతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టాలంటే జాతీయ అభివృద్ధి మండలిలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఏపీతో సమానంగా ప్రత్యేక హోదా అడిగేందుకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే తమ పార్టీ పెట్టలేకపోతుందని వెంకయ్యనాయుడు వివరించాడు. అంతే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని నీతి ఆయోగ్ తెలిపిందని అయినాకానీ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడానికి అడుగు ముందుకేశామని, అది ఎంతమాత్రం సాధ్యపడలేదని తెలిపాడు. ఇది ఇలా ఉండగా అసలు ప్రత్యేక హోదాతో ఏపీకి లాభం కంటే నష్టమే ఎక్కువంటూ సుజనా చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం.