ఒకప్పుడు మొదటి సినిమాతోనే సూపర్‌హిట్ కొట్టిన దర్శకులు ఆ తర్వాత వచ్చే... ద్వితీయవిఘ్నాన్ని అధిగమించలేకపోయేవారు. దీంతో ఆయా దర్శకులు కూడా ద్వితీయ చిత్రం అంటేనే భయపడేవారు. కానీ నేడు కొందరు కొత్తతరం దర్శకులు మాత్రం మొదటి సినిమాకి రెండో సినిమాకు మధ్య బాగా గ్యాప్ తీసుకుంటూ ద్వితీయ విఘ్నాలను కూడా సులభంగా దాటేస్తున్నారు. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు కొరటాల శివది. 'మిర్చి' తర్వాత 'శ్రీమంతుడు' తీసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన కొరటాల ఇప్పుడు 'జనతా గ్యారేజ్'తో వరసగా హ్యాట్రిక్ హిట్‌లను సొంతం చేసుకున్నాడు. రాజమౌళి, బోయపాటి శ్రీను వంటి దర్శకులకు ధీటుగా తాను ద్వితీయ విఘ్నాన్ని దాటేసి మూడు చిత్రాలకే స్టార్ డైరెక్టర్ హోదా సొంతం చేసుకున్నాడు. ఇక 'పటాస్'తో సూపర్‌హిట్ కొట్టిన అనిల్ రావిపూడి కూడా 'సుప్రీం'తో కమర్షియల్ హిట్ కొట్టాడు. తాజాగా నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కూడా 'ఊహలు గుసగుసలాడే'తో మంచి హిట్ కొట్టి ఇప్పుడు 'జ్యో అచ్యుతానంద' చిత్రంతో ద్వితీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాస్త గ్యాప్ తీసుకున్నా వీరందరూ ద్వితీయ విఘ్నాలను అధిగమించడంతో పాటు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.