ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఆంధ్రా నేతలకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకు దమ్ము, ధైర్యం ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చి తీరాలని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పవన్... నాయకులు ప్రజాసేవకోసం రాజకీయాలలోకి రావడం లేదని, స్వార్థ ప్రయోజనాలు ఆశించి, వాటిని నెరవేర్చుకోవడానికే రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశాడు. అలా కాని పక్షంలో ప్రజాప్రతినిధులు ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వస్తే వారి ఆకాంక్షకు అనుగుణంగా మెలగాలని, వారి ఆశయ సాధన కోసం ఎంతటికైనా తెగించాలని, అలా లేని నాయకుడి జీవితం దండగ అని వ్యాాఖ్యానించాడు. ఇంకా ప్రజల కోసం తాను అన్న, వదిన, అక్క, చెల్లి, అమ్మ అందరినీ వదులుకొని తెగించి బయటకు వచ్చానని కానీ ఇప్పుడు చేస్తున్నా రాజకీయాలను చూస్తుంటే గుండె దహించుకు పోతుందని వివరించాడు పవన్.
కాగా నాయకులు అధికారం కోసం ఎంతకైనా తెగించి గెలిచినప్పుడు అంతే తెగింపుతో ప్రజాకాంక్షకు అనుకూలంగా ఎందుకు నడవలేకపోతున్నారని ప్రశ్నించాడు పవన్. అలా పవన్ లో ఉండే ఫైర్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. కాగా పవన్ ప్రసంగం విన్న ప్రతి ఆంధ్రా నాయకుడు చాలా తేలికగా తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఏ నాయకుడిలోనూ చలనం రాలేదు సరికదా ఒక్కరు కూడానూ పవన్ ప్రసంగాన్ని సమర్థించేలా మాట్లాడకపోవడం శోచనీయం. పవన్ ప్రసంగించి 24గంటలు దాటినా జనసేనాని ప్రసంగంపై ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎటువంటి వ్యాఖ్యలు చేయక పోవడం వెనుక కారణాలు చాలా వినపడుతున్నాయి. పవన్ ప్రసంగం ప్రధానంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని సాగుతుందని, ఎవరు ఆయన్ని విమర్శించినా వారిపై మరో సభలో ఖచ్చితంగా ప్రస్తావిస్తుండటంతో ఈసారి పవన్ కు ఏ నాయకుడూ అంత అవకాశం ఇవ్వనట్లుగా తెలుస్తుంది. ఇంకా పవన్ మాటల పట్ల ప్రతి నాయకుడూ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నాడు. దాంతో ఏ నాయకుడినీ పవన్ ప్రసంగం ఆకర్షించలేదని, ఆయన ప్రసంగానికి ప్రభావితుడైన నాయకుడూ ఎవరూ లేడని కూడా అర్ధమౌతుంది. ఇంకా పవన్ ప్రసంగంలో అంతకీ పౌరుషం రాకపోతే కాస్త కారమో, పచ్చడి ముద్దనో రాసుకొని మరీ పోరాడమన్నాడు. పార్టీల కంటే ప్రజలే ముఖ్యమనీ, ప్రజలకోసం రాజీనామాలైనా చేయడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చాడు. కానీ కేంద్రంపై ఇప్పటికీ ఏ ఒక్కనాయకుడు కూడా బాణాన్ని సంధించలేదు సరికదా వెంకయ్యనాయుడు, ఇతర భాజపా భజన పరులు మాత్రం పవన్ అపరిపక్వదృక్పధంతో మాట్లాడుతున్నాడని, రాజకీయాలు తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేస్తున్నారు. ఇంకా సినిమా డైలాగ్ లు చెప్పినంత తేలిక కాదు ప్రజల్లోకి వచ్చి వారికోసం పోరాడటం అంటే అంటూ ఆరోపిస్తున్నారు. ఇలా రాజీనామాల దిశగా కూడా ఏ నాయకుడూ ఆలోచిస్తున్నట్లు లేదనే చెప్పాలి. ఇలాంటి ఇటువంటి స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా సాగే నాయకులకు అంతటి తెగింపు కలుగుతుందా? చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.?