మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నటుడు అయిన మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మోహన్ బాబు, కుమార్తె మంచు లక్ష్మితో కలిసి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును కలవడంతో చర్చనీయాంశం అయింది. మోహన్ బాబు ఈ మధ్య విలేకరులతో మాట్లాడుతూ తాను తిరిగి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలు చేయలనుకుంటున్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మొన్న యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగుడుతూ ఆయన పాలనను ఎన్టీరామారావు పాలనతో పోల్చాడు. ఎన్టీరామారావు అంతటి గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నాడు.
అయితే ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడిని కలవడంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతం కొంతకాలంగా మోహన్ బాబు వైకాపాలోకి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి ఊహాగానాలు రావడానికి వారి కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు, బంధుత్వాలు అని కూడా అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా ఆంధ్రాలో ప్రత్యేక సెగలు ముమ్మరంగా రేగుతున్న ఈ సందర్భంలో మోహన్ బాబు, చంద్రబాబును కుమార్తెతో సహా కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయంగా చెప్పవచ్చు. ఇప్పుడు మోహన్ బాబు చూపు అధికారపార్టీ అయిన తెదేపాపై పడిందని అతి త్వరలో తెదేపా కండువా పుచ్చుకోబోతున్నాడనే వార్త..ఈ భేటీ అనంతరం బలంగా వినిపిస్తుంది. ఇదే నిజమైతే తిరిగి సొంతగూటికి చేరుకున్న మోహన్ బాబు అని అనుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా వీరి భేటీ మాత్రం రసవత్తరమైన రాజకీయ చర్చకు దారి తీసే అంశమే.