జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులంతా బాధ్యతాయుతంగా ప్రత్యేక హోదాపై పోరాడాలని.. వారి చేతకాని పక్షంలో తాను ఖచ్చితంగా రంగంలోకి దిగుతానని తేల్చి చెప్పారు పవన్. కాగా పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రసంగానికి, కాకినాడ ప్రసంగానికి తేడా వచ్చిందని, కాకినాడ సభలో పవన్ లో ఫైర్ తగ్గిందని, చెప్పిన మాటలు కూడా బోలాతనంగా ఉన్నయన్న విమర్శలు వచ్చాయి. ఏదైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకి ఆచరణాత్మకంగా చేసి చూపిస్తే పవన్ మాటలను ప్రజలు నమ్ముతారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రకంగా చూసినప్పుడు పవన్ తాజా స్పందన ప్రధాన్యత సంతరించుకుంది. కాగా పవన్ స్పందిస్తూ తాను ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని ఆయన వెల్లడించాడు. పవన్ తిరుపతిలో గానీ, కాకినాడ సభలో గానీ ప్రజాప్రతినిధులపైనే బాణాలను సంధించిన విషయం తెలిసిందే. తాను ఎంతసేపటికీ ఎంపీలు, మంత్రులు, వారి వైఖరిని వెల్లడిస్తున్నారే తప్ప తానేం చేయాలనుకుంటున్నాడో తెలపాలన్న విషయంపై ఆంధ్రానేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పవన్ మాట్లాడుతూ.... కేంద్రాన్ని వణికించేలా ప్రజాప్రతినిధులు తీవ్రంగా పోరాడాలని వెల్లడించాడు.
నేతలు తుచ్చమైన పదవుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టవద్దని, అవసరమనుకుంటే పదవులకు రాజీనామా చేసైనా నేతలంతా కలిసికట్టుగా ప్రత్యేక హోదాపై ఉధ్యమించాలని వివరించాడు. వారు అలా పోరాటం చేసి అప్పుడు కూడా కేంద్రం నుండి సుముఖత వ్యక్తం కానప్పుడు, ఇలా ప్రజా ప్రతినిధులు పోరాడటంలో విఫలమైనప్పుడు తప్పకుండా తాను రంగంలోకి దిగుతానని, అప్పుడు జనసేన చూసుకుంటుందని చెప్పాడు పవన్. కాగా కాకినాడ సభలో జరిగిన తొక్కిసలాటలో భాగంగా వెంకటరమణ అనే యువకుడు చెట్టు మీద నుంచి పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ స్పందిస్తూ ఇలా ఓ కార్యకర్త చనిపోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వెల్లడించాడు.