ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాజపా, తెలుగు దేశం పార్టీలకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో తెదేపా అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారాడు. కాగా కాకినాడలో పవన్ ప్రసంగిస్తూ ఆంధ్రా రాజకీయ నాయకులకు దమ్ముు, ధైర్యం ఉంటే ఎందుకు హోదాపై పోరాటం చేయడం లేదంటూ విరుచుకు పడ్డాడు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెదేపాకు తాము మద్దతు పలకడమే కాకుండా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగి ప్రచారం చేసిన విషయాన్ని అధికార పార్టీకి గుర్తి చేశాడు. అలా అధికారం అందిపుచ్చుకున్న తెదేపా పాలకులు ఇప్పుడు వ్యాపార ధోరణిలో, స్వార్ధ దృష్టితో ప్రజాకాంక్షను గాలికి వదిలేసి పాలన సాగిస్తున్నారని వెల్లడించాడు. కాగా తాను ఏ నాయకుడి ఎదుగుదలకు అడ్డురానని, తన బాధంతా ప్రజా సేవను మరచి ఎవరికి వారు సొంత లాబాలను చూసుకోవడం పైనే అని తెలిపాడు.
కేంద్రం తెలుగు ప్రజలను విడదీసిన కాలంలో ఎంతో బాధకు గురయ్యానన్నాడు. ఆ బాధ తనను 11 రోజుల వరకు తిండిని తినిపించలేదని అలాంటి క్షోభను అనుభవించానన్నాడు. ఇంకా తనకు తెలంగాణ వచ్చినందువల్ల బాధలేదని, విభజించిన విధానం, నాన్చుడు ధోరణి, అస్పష్ట వైఖరితో, భయం భయంగా, చులకనగా విడిపోయామన్నదే తన మనస్సును కలచివేసిందని వ్యాఖ్యానించాడు. 1997లో భాజపా తెలంగాణను ఇస్తామన్నప్పుడు ఎందుకు తేల్చలేదు, కాంగ్రెస్ పార్టీ 2004లో తెలంగాణ ఇస్తామన్నప్పుడు అదే భాజపా ఎందుకు మద్దతు పలికింది అని ప్రశ్నించాడు. అంటే ప్రజలను పక్కనబెట్టి అధికారమే పరమావదిగా ఏ పార్టీ అనుకూల వైఖరిని, అధికార దాహాన్ని ఆ పార్టీ అవలంబించడం ఎంతవరకు సమంజసమంటూ బాజపా, కాంగ్రెస్ పార్టీలపై దుమ్మెత్తిపోశాడు. నిజంగా ప్రస్తుతం తన పోరాటం అంతా ఉత్తారాది అహంకారం మీదనే అంటూ తన వాగ్బాణాలను సంధించాడు.
ఇంకా కేంద్ర మంత్రులైన వెంకయ్య నాయడు అంటే గౌరవముందనీ, తాను పెద్దాయన అంటూ గొప్ప పదవిలో అధికారాన్ని అనుభవిస్తూ చూస్తూ మోసానికి గురౌతుంటే మాట్లాడకుండా సమర్ధించడం ఎంతవరకు సమంజసమన్నాడు. వెంకయ్య ప్రసంగించేప్పుడు చేసే హావబావాలను ప్రదర్శించి చూపాడు. ఆయన ఊకదంపుడు ప్రసంగాన్ని బాజపా వస్తే అంతా ఆనందంగా, సంతోషంగా ఉంటారన్న ఊతపదాలను వాడి ఎన్నికల్లో గెలిచారు, గెలిచాక ప్రజలను, ప్రజాకాంక్షలను గాలికి వదిలేశారని దుమ్మెత్తిపోశాడు. అంటే ఓటు కోసం వచ్చినప్పుడు ఒక బాష, అధికారంలోకి వచ్చాక ప్రజలకు అర్ధంకానీ భాషను వెంకయ్యనాయుడు ఉపయోగిస్తూ ప్రజాక్షేమాన్ని మరచి పాలిస్తున్న వైఖరిని ఎండకట్టాడు. ఇంకా తాను అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కి ఓ సవాల్ విసిరాడు. ప్రత్యేక హోదా కోసం ముందు మీరు రాజీనామా చేయండి. దగ్గరుండి నేను గెల్పించుకుంటానన్నాడు పవన్ కళ్యాణ్. నాయకులందరికీ మీరు స్పూర్తిగా నిలవమన్నాడు. తాను అండగా నిలపడతాను అంటూ పవన్ వెల్లడించాడు. వెంకయ్యనాయుడుకి పలు విధాలుగా రెచ్చగొట్టినట్లు చెప్పాడు. మీరు మీ విధివాధానాలు మార్చుకొని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయక పోతే, మీరు కేంద్రానికి లొంగిపోతే ప్రజలు పౌరుషం లేని వారిలా మిగిలిపోతారన్న విషయాన్ని అర్థం చేసుకోండి అన్నాడు పవన్. ఏ నాయకుడైనా కూడా వ్యాపారాల మీద పెట్టిన దక్షత, బుద్ధి ప్రజల పాలనపై పెట్టడం లేదని, ప్రజాకాంక్షపై మనస్సు నిలవడం లేదని వివరించాడు. తెలుగుదేశం, భాజపాకు తాను కుటుంబాన్నంతా వదిలి పెట్టి ప్రాణాలర్పించేంతగా ఎన్నికల్లో కష్ట పడ్డాను. అలాంటిది ప్రస్తుతం మీరు అన్యాయాలకు దిగుతుంటే జనసేన చూస్తూ ఊరుకోదు అన్నాడు పవన్. ఇంకా ఏపీలో భాజపా లేదని, ఆ పార్టీ నేతలంతా పార్టీలు మారాలని చెప్పాడు. ఇంకా తనకు దమ్ము, ధైర్యం ఉందని, ఏదైనా చేయగలను అన్నాడు. సీమాంద్ర నేతలంతా ఒంటికి కారంపూసుకొని, పచ్చడి ముద్ద తిని పార్లమెంటుకు వెళ్ళి పోరాడండి అన్నాడు. కేవలం నేతల రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగా జైఆంధ్ర ఉధ్యమంలో 400 మంది మరణించారు. వారికి తగిన స్మారక స్తూపాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నాడు. అదీ తెలంగాణను చూసి నేర్చుకోమన్నాడు. వెంకయ్యనాయుడు వంటి నేతల భావోద్వేగ పూరిత ప్రసంగాలకు ఎంతో మంది ఉద్యమకారులు బలి అయ్యారన్నాడు. కేవలం భాజపా, కాంగ్రెస్ పార్టీలు, నాయకులు తాత్సారం చేయడం మూలంగానే సీమాంద్ర, ఆ ప్రాంత ప్రజలు ఎంతగానో నష్టపోయారన్నాడు.
చివరగా రాష్ట్రం విడిపోయాక సీమాంధ్ర ప్రజలు పలురకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, సరైన సాగు లేకపోవడం వంటివి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయన్నాడు. కాగా తాను ప్రజల్లోకి దూకడం ఎంతోసేపు పట్టదు. తాను తలచుకుంటే మిగిలిన రెండున్నర సంవత్సరంలో పార్టీలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించగలను అన్నాడు పవన్. దమ్ముంటే రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడండి అంటూ నేతలందరికీ సవాల్ విసిరాడు. అలా చేయకపోతే తాను ఊరుకోనని ఏమైనా చేయగలనని హెచ్చరించాడు పవన్ కళ్యాణ్.