కాకినాడలో జనసేన ఆధ్వర్యంలో సీమాంధ్ర ఆత్మగౌరవ బహిరంగ సభకు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాడని ఆయన్ని చూడగానే అందరికి అర్ధమయ్యే ఉంటుంది. ఇక ఈ సభకి భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలకు అభివాదం చేసి తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు పవన్. ఇక పవన్ మొదటగా పోలీస్ సిబ్బందికి సహకరించాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు. తన ప్రసంగాన్నిమొదలపెడుతూ నేను మీ హక్కుల కోసం వచ్చా మీ సహకారం కావాలని అని ప్రజలనుద్దేశించి అన్నాడు. తెలంగాణకు హైకోర్టు, ఏపీకి ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం చాలా అన్యాయం చేసిందని కేంద్రం పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేసిందని అన్నారు. సీమాంధ్రకు వచ్చి సీమాంధ్రనే విడదీస్తారా అని ఆయన బిజెపి నేతలు, కేంద్ర మంత్రులపై మండిపడ్డారు. తెలంగాణ వాళ్లూ మన సోదరులే, ఆత్మ బంధువులేనన్నారు. నిజాం నిరంకుశత్వంతో తెలంగాణ ప్రజలు చాలా వెనుకబడ్డారన్నారు. అన్నదమ్ముల్లా ఉంటారని ఆంధ్ర, తెలంగాణ ప్రజల్ని ఆనాటి పెద్దలు కలిపారని గుర్తు చేశారు. ముల్కి విధానాలతో మా ఉద్యోగాలు మాకే కావాలని తెలంగాణ వాళ్లన్నారన్నారు. అనాడే 'జై ఆంధ్రా ఉద్యమం' ప్రారంభమైందన్నారు. వెంకయ్యనాయుడు కూడా జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నన్ను బీజీపీ వాళ్లూ, తెలుగుదేశం వాళ్లూ నడిపిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నన్ను ఒకళ్లు నడిపించాలా? నాకు పౌరుషం లేదా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ దోపిడీ విధానాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. హోదా విషయంలో అదిగో ఇదిగో అంటూ తెలుగుదేశం, బీజేపీ ఏపీ ప్రజలను మభ్య పెట్టాయని అన్నారు. తనకు ఏ పార్టీతోనూ విభేదాలు లేవన్న పవన్ కల్యాణ్…ప్రజా సమస్యల కోసం అందరితో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. నూట ఏభై ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ లో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ లా విలువలు ఉన్న నేతలెవరూ ఇప్పుడు లేరని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు నాలుగు సంవత్సరాలుగా హోదా ఇస్తామంటూ, తీపికబురు వస్తోంది అంటూ పాచి కంపు కొట్టే రెండు లడ్డూలిచ్చారని పవన్ అన్నారు. ఏపీకి హోదా ఇవ్వడానికి బదులు స్పెషల్ ప్యాకేజీని ప్రకటించడంపై ఆయన ఈ విధమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ లడ్డూలకంటే మా బందరు లడ్డులు బాగుంటాయి కదా..! మా తాపేశ్వరం కాజా ఇంకా బాగుంటుంది కదా..! అని పవన్ వ్యగ్యం గా మాట్లాడాడు. ఈ విధంగా హోదా విషయం లో పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లకు చురకలంటించాడు.