జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడలోని జెఎన్టీయు మైదానంలో ఎంతో భావోద్వేగంతో ప్రసంగించాడు. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్ళుగా కేంద్రప్రభుత్వం ఊరిస్తున్న వైఖరిని ఎండకట్టాడు. హోదా ఇస్తామంటూ రెండు పాచిపోయిన లడ్డూలిచ్చిందంటూ, ఆ రెండు లడ్డూలు పాతిక మంది ఎంపీలకు కూడా సరిపోదు అంటూ కేంద్రాన్ని దుయ్యబట్టాడు పవన్ కళ్యాణ్. భారతదేశంలో ప్రాంతాల పరమైన వివక్ష సాగుతుందంటూ ప్రసంగాన్ని ప్రారంభించాడు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉత్తరభారతానికి ఒకరకమైన పాలన, దక్షిణ భారతానికి మరోరకమైన పాలన సాగిస్తున్న పాలకుల వైఖరిని దులిపివేశాడు పవన్ కళ్యాణ్. మరీ దక్షిణ భారతీయులంటే ఉత్తర భారతీయులకు చులకన భావం ఏర్పడిందంటూ, మనలో ఆ చేవ చచ్చిందా, మనకు దమ్ము ధైర్యం లేదా అంటూ భావోద్వేగంతో ప్రసంగించాడు జనసేనాని పవన్.
కాగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన పాచిపోయిన రెండు లడ్డూలకంటే మా తాపేశ్వరం, బందరు లడ్డూలు చాలా బాగుంటాయంటూ కేంద్రం చెంప చెళ్ళుమనిపించాడు. అవకాశపు వాద రాజకీయాల మూలంగా వచ్చిన ఈ సమస్యలపై తన పోరాటం సాగుతుందన్నాడు. ఇంకా గతంలో తిరుపతి సభ తర్వాత పలువురు నేతల పవన్ పై చేసిన కామెంట్లపై స్పందించాడు. ఈ సందర్బంగా తానెవరికీ భయపడననీ, తనకు వ్యక్తిగతమైన కక్షసాధింపులు వంటివి లేవని తనకు కావాల్సింది ప్రజాక్షేమంతో కూడిన ప్రజాపాలన అంటూ తనదైన శైలిలో ప్రసంగించాడు. తను చాలా సామాన్యుడినని, తన తాత పోస్ట్ మాన్, తండ్రి అతి సామాన్య పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా రాజకీయ నేతల వలే తనకు ఎలాంటి ధనం, వందల ఎకరాలు కబ్జాలు చేసిన భూములు లేవని చెప్పాడు. తాను ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులేదు తింటానికి కూడా తిండి లేదు కాని అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తానన్నాడు. నాయకులు సమస్యలు పరిష్కరించకపోయినా పర్వాలేదు కొత్త సమస్యలను సృష్టించకండంటూ భారత రాజకీయ నేతలందరినీ హెచ్చరించాడు.
తనను, ఏ పార్టీ, ఏ నాయకుడు వెనక ఉండి నడిపించడం లేదని నాకు పౌరుషం లేదనుకుంటున్నారా.. అన్నాడు. ప్రజాసమస్యల పట్ల తనకు అవగాహన ఉందని, తనకూ చరిత్ర తెలుసన్నాడు. తెలంగాణ పోరాటం, జైఆంధ్ర ఉద్యమం వంటి చారిత్రక సందర్భాల్లో వందల మంది యువకులు ఎలా బలిదానాలయ్యారో వివరించాడు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారన్నాడు. 150 యేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేకుండా వ్యవహరించిందన్నాడు. ఇంకా కాంగ్రెస్ డొక్కలో పొడిస్తే, భాజపా పొట్టలో పొడిచిందంటూ వెల్లడించాడు. చట్టసభల సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వమంటే ఇప్పుడు రాజ్యాంగం ఒప్పుకోవడం లేదు, ఆర్ధిక సంఘం ఒప్పుకోవడం లేదు, ఆర్ధిక శాఖ మంత్రి ఒప్పుకోవడం లేదు అంటూ కేంద్రం కుంటిసాకులు వల్లిస్తుందన్నాడు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని అన్న మాటకు కేంద్రం కట్టుబడి ఉండలేదన్నాడు. తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవం, పౌరుషం, ధైర్యం ఉన్నాయని కేంద్రానికి సవాల్ విసిరాడు. ముఖ్యంగా తనకు ప్రజలే గాడ్ ఫాదర్ అన్నాడు పవన్.
ఇంకా పవన్ చాలా నిజమైన నిలకడ కలిగిన, బాధ్యతాయుత రాజకీయ వేత్తగా వ్యవహరించాడు. ప్రజలు చేపట్టే దీక్షలు, నిరసనలు గురించి మాట్లాడాడు. కార్యకర్తలు, అభిమానులు దీక్షలు ఎందుకు చేయాలి. మనం ఓట్లు వేసి గెలిపించాం. మనకు సమస్య వచ్చినప్పుడు నాయకులు పోరాడ వలసిన బాధ్యత వారికి ఉంది అన్నాడు. అస్సలు తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం సీమాంధ్ర నాయకులు ఎంత కారణమో, తెలంగాణ ప్రాంత నాయకులు అంతకంటే కారణమన్నాడు. చివరికి తన గురించి ఎంత మంది మాట్లాడినా సత్యమే గెలుస్తుందని సత్యం కోసమే తన పోరాటం అంతా అంటూ వివరించాడు.