యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ అనుకుంటున్న కోరిక జనతా గ్యారేజ్ తీర్చేసినట్లుగానే భావించవచ్చు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో రికార్డులను అధిగమించే హిట్ కోసం ఎన్టీఆర్ ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీ టాప్-5 సినిమాల్లోకి జనతా గ్యారేజ్ చేరిపోగా అందులో ఏ స్థానంలోకి చేరుతుందనేదే ఇక మిగిలింది. ప్రాంతాల వారీగా తీసుకున్నా బాహుబలి తర్వాత రికార్డులన్నీ ఎన్టీఆర్ ఖాతాలో జమైపోతున్నాయి.
జనతా గ్యారేజ్ తనకు అందించిన బ్లాక్ బస్టర్ విజయానందాన్ని ఎన్టీఆర్ అభిమానులతో సహా డిస్టిబ్యూటర్లతో కూడా పంచుకొనేందుకు నిర్ణయించేసుకున్నాడు. కాగా ఈ విజయోత్సవాన్ని ఈ నెల 10 వ తేదీన విశాఖలో జరపాలని మొదట భావించినా, ఆ తర్వాత గణేష్ నిమజ్జనం కారణంగా అక్కడ పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఎన్టీఆర్ మరో చోట ఈ విజయాన్ని జరుపుకోవాలని భావించాడు. వెంటనే అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమైనారు చిత్ర బృందం. ఈ విజయోత్సవానికి జనతా గ్యారేజ్ టీమ్ మెంబర్లతో సహా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లందరికీ హైద్రాబాద్ లో పెద్ద పార్టీ ఇవ్వనున్నాడు ఎన్టీఆర్. ఇంకా పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ సన్నిహితులు, స్నేహితులు కూడా ఈ పార్టీకి హాజరుకానున్నారు.
కాగా హైదరాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగే ఈ విజయోత్సవ పార్టీలో ముందుగా చిత్రయూనిట్ తో సక్సెస్ మీట్ నిర్వహించి ఆ తర్వా త జనతా గ్యారేజ్ విజయోత్సవ పార్టీ జరుగుతుందని తెలుస్తుంది. అయితే గతంలో టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల విజయోత్సవ పార్టీలు కూడా ఇలాగే నిర్వహించాడు ఎన్టీఆర్.