సూపర్ స్టార్ మహేష్ బాబు.. మణిరత్నం డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడని ఆ మధ్య ఎప్పుడో వార్తలొచ్చాయి. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. మణిరత్నం డైరెక్షన్ లో చెయ్యడానికి మహేష్ కూడా మొగ్గు చూపాడని తన డేట్స్ అడ్జెస్ట్ చెయ్యడానికి కూడా వెనుకాడలేదని అన్నారు. ఈ సినిమాలో మహేష్ తో పాటు తమిళ హీరో విజయ్ కూడా నటిస్తున్నాడని అన్నారు. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ లోనే ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఆగిపోవటానికి కారణం ఒక హీరో ఒప్పుకుంటే మరో హీరో ఒప్పుకోలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అసలు కారణం అదికాదంట. వేరే ఉందట. అదేమిటంటే చారిత్రాత్మక కథతో తెరకెక్కే ఈ చిత్రం ప్రముఖ దేవాలయాల్లో చిత్రీకరించాలని అనుకున్నారట. అయితే తమిళనాట ఏ దేవాలయం కూడా షూటింగ్ చెయ్యడానికి ఒప్పుకోలేదట. అందుకే ఆ దేవాలయాల సెట్స్ వేసి సినిమా తియ్యాలని అనుకున్నారట. కానీ దేవాలయాల సెట్స్ కే చాలా పెద్దమొత్తం ఖర్చయ్యేలా ఉందని వెనక్కి తగ్గారని సమాచారం. ఆ మొత్తం దాదాపు 50 కోట్ల వరకు అవుతుందట. ఇక హీరోల రెమ్యునరేషన్... ప్రొడక్షన్ ఖర్చు అంతా కలిపి దాదాపు 200 కోట్లవరకు ఈ సినిమాకి బడ్జెట్ అవుతుందని... అందుకే అంత సాహసం చెయ్యలేక ఈ సినిమాని మరుగున పడేశారని అంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ ఈ కథకు స్క్రీన్ ప్లే, రచయిత అయిన జయమోహన్ బయటపెట్టాడు. మరి సినిమా కథ మీద నమ్మకం వున్నప్పుడు 200 బడ్జెట్ పెట్టి తియ్యడానికి దర్శక నిర్మాతలు ఎందుకు వెనుకంజ వేశారో... ఏది ఏమైనా ఒక చారిత్రాత్మక... మల్టీస్టారర్ ని చూసేందుకు ప్రేక్షకులకు అదృష్టం లేదనే చెప్పాలి. ఇప్పటికైనా ఆ భారీ బడ్జెట్ ని పెట్టేందుకు ఎవరైనా నిర్మాతలు గనక ముందుకు వస్తే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు.