తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తనకూ ఓ అవకాశం ఇవ్వండి అంటూ సినీ నటి నగ్మా కేంద్ర కాంగ్రెస్ పార్టీని కోరింది. కాగా గత కొంత కాలంగా తమిళనాడులో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఇంతకు ముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఈవీకేఎస్ ఇలంగోవన్ కొనసాగి రాజీనామా కూడా చేసి దాదాపు వంద రోజులయింది. అప్పటి నుండి ఈ అధ్యక్ష పదవికి నియామకం చేపట్టలేదు. దానికి తమిళనాట ఉన్న గ్రూపు రాజకీయాలే కారణంగా చెప్పవచ్చు. ఇటువంటి సందర్భంలో పురుషుల కంటే మేమేం తక్కువ కాదు అన్నట్లుగా మహిళలు కూడా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మహిళల తరఫు నుండి ప్రధానంగా నగ్మా గొంతు వినపడుతుంది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మహిళలు కూడా అర్హులేనంటూ ముందుకొచ్చింది నగ్మా. ఆ పదవిని మహిళలు సమర్థవంతంగా చేపట్టగలరని, ఎవరైనా ఒకరిని అధ్యక్ష పదవి కోసం మహిళను ఎంపిక చేయాలన్న తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నగ్మా చెప్పకనే చెప్పింది.
అయితే నగ్మా మాటలు తమిళనాడు మహిళా నేతలకు మంచి హుషారును నింపాయి. ఈ సందర్భంలో బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం చెన్నైలో జరిగింది. ఇందులో భాగంగానే నగ్మా ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చింది. రాష్ట్ర మహిళా విభాగానికి చెందిన ముఖ్య నాయకమణ్యులతో పాల్గొని నగ్మా ఈ సమావేశంలో చర్చించింది. మొత్తానికి నగ్మా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పోటీలో ఉందన్నమాట.