ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం తర్జన భర్జనలు పడుతుంది. పలు దఫాలుగా రాష్ట్ర నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. పలు సమావేశాలలో పాల్గొన్నారు. అనేక రకాలుగా రాష్ట్ర నేతలకు చెప్పి చూసింది కేంద్రం. కానీ ప్రజాగ్రహానికి భయపడి నేతలు ప్రత్యేక హోదానే కావాలంటూ ఢిల్లీలో ఉద్యమిస్తున్నట్లుగా ప్రజల మెప్పు పొందేందుకు మాత్రమే నటిస్తున్నారు. ఈ దశలో ఉన్నట్టుండి ఏపీ ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి ఇక ప్రత్యేక ప్యాకేజీకే కేంద్రం ప్రకటన చేసే దిశగా సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ మరోసారి రాష్ట్రప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశాడు. అవేమంటే ఏకంగా సీఎం చంద్రబాబుకు కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. కేంద్రం ఇచ్చే పిండాకూడులాంటి ప్యాకేజికి ఏమాత్రం కక్కుర్తి పడొద్దని చంద్రబాబుకు సూచించాడు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు చేయి చాపితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో, భాజపాతో కలసి పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో తెదేపాకు చిప్ప ఖాయం అంటూ తెదేపా భవిష్యత్తును కళ్ళముందు దర్శింపజేశాడు. ఇంకా విశాఖను కాదని విజయవాడని రైల్వే జోన్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి శివాజీ స్పందించాడు. విశాఖను రైల్వే జోన్ గా ప్రకటిస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, అలా కాకుండా విజయవాడను రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శివాజీ హెచ్చరించాడు.