తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో తెదేపా ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు సమావేశం అయ్యారు. వెంకయ్యనాయుడుతో తెదేపా ఎంపీలు సుదీర్ఘంగా జరిపిన మంతనాల తర్వాత సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు వెల్లడించాడు. కానీ ఆ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకే మెగ్గుచూపుతుందని, ఈ విషయంపై ఏదో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించాడు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిపైనే దృష్టి పెట్టామని తెలిపాడు.
అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రాకారం రావాల్సిన ఆర్థిక ప్యాకేజీ, వాగ్దానాలు వీటికి సంబంధించి కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, భాజపా నేత పురందేశ్వరి అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోబోమని భాజపా తరఫున ఆమె మాటగా తెలిపింది.
అయితే ఈరోజు వెంకయ్య నాయుడే స్వయంగా ఏపీ సీయం చంద్రబాబు నాయడుకి ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కష్టంతో కూడుకున్న విషయం కాబట్టి ప్యాకేజీ అందుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాగా ఈ విషయంపై చంద్రబాబు హడావుడిగా హస్తిన బాట పట్టే అవకాశం ఉంది. కేంద్రం కూడానూ ఏపీ సీయం సమక్షంలోనే ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టమైన ప్రకటన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.