జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టే ఉధ్యమంలో భాగంగా మొదట కాకినాడలో సభ పెడతామని చెప్పిన విషయం తెలిసిందే. కాగా కాకినాడలో జరిగే ఈ సభావేదిక కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సెప్టెంబర్ 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు జేఎన్‌టీయూ గ్రౌండ్స్ లో సభ ప్రారంభమౌతుంది. దాదాపు 40 వేల మంది పట్టే సామర్ధ్యం ఉన్న ఈ గ్రౌండ్‌లో లక్ష మందికి పైగా వస్తారని అంచనా. అయితే ఈ సభకు సంబంధించి పవన్ తరఫున రాఘవయ్య అనే వ్యక్తి అనుమతులు గట్రా తీసేసుకోవడం జరిగింది. సీమాంధ్ర ఆత్మ గౌరవ సభలో జరిగే ఈ ప్రసంగానికంటే ముందు కిరణ్ కంటి ఆసుపత్రిని పవన్ కళ్యాణ్ సందర్శించనున్నట్లు తెలుస్తుంది. ఈ కంటి ఆసుపత్రి ప్రత్యేకత ఏంటంటే నిరుపేదలైన ఎందరికో ఉచితంగా కంటి చికిత్సలు చేస్తున్న సంకురాత్రి ఫౌండేషన్ గురించి కూడా సభలో మాట్లాడవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రత్యేకహోదా కోసం తాను ఎలా సాధించాలి, ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న విషయాలపై ప్రసంగించే అవకాశం ఎక్కువగా ఉంది. అదే సందర్భంలో హోదాని బలిపెట్టిన భాజపా, తెదేపాలపై విరుచుకుపడే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే రాష్టంలో తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రెండున్నర సంవత్సరాలు ఎటువంటి ఘన కార్యాలు సాధించిందన్నదీ ప్రస్తావించే అవకాశం ఉంది. ఇంకా తాను రాజకీయ రంగ ప్రవేశం తదితర విషయాల తాలూకూ డబ్బా మాటలు మామూలే కదా. కాకపోతే తాను కులాలకు అతీతుడిని అని మాత్రం గట్టిగా చెప్పదలిచాడు. తిరుపతిలోని తన ప్రసంగాన్ని విమర్శించిన వారిపై కూడా ఆయన స్పందించే అవకాశం మెండుగా ఉందన్నది గతంలో జరిగిన కొన్ని పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఇంకా కాపు రిజర్వేషన్ల విషయంలో చాలా నాటకాలు ఆడుతున్న తెదేపాని, స్పష్టమైన వైఖరిని చెప్పాలని ఆయా పార్టీలను కోరినట్లుగా చెంప చెళ్ళుమనిపించే అవకాశం లేకపోలేదు. కాగా సభకు తరలి వచ్చే జనాభాలో 80శాతం మంది కాపు వర్గానికి చెందిన వారే ఉండవచ్చని అది బయటికి చెప్పక పోయినా జగమెరిగిన సత్యం. కాబట్టి అలాంటప్పుడు వారిని ఆకట్టుకునే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో జరిగే సభ కాబట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సభకు తరలి వస్తారు కాబట్టి, విభజన జరిగాక అత్యంత దయనీయంగా మారిన ఆయా ప్రాంతాల సమస్యలపై కూడా పవన్ పంచ్ పడే అవకాశం ఉంది. ఈ నెలలోనే సెప్టెంబర్ 11వ తేదీన రాజమండ్రిలో ముద్రగడ కాపునాడు పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే పవన్ ఎప్పుడూ అణగారిన వర్గాలపై వల్లమాలిన ప్రేమ చూపుతుంటాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని వెనకబడిన ప్రాంతాల విషయంలో కేంద్రం కేటాయించిన నిధులను ప్రస్తావించే అవకాశం ఉంది.