జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి భారీ బహిరంగ సభలో వైకాపా ఎమ్మెల్యే రోజాపై పరోక్ష విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రోజా తనని తానూ సమర్ధించుకొనేందుకు తన వల్లనే పవన్ లో ఇంత కదలిక వచ్చిందన్నట్లుగా మాట్లాడింది. కాగా రోజా శాసనసభలో అనుచితంగా ప్రవర్తించినందుకుగాను అసెంబ్లీ నుండి ఏడాది పాటు సస్పెండ్ అవడం, హైకోర్టు, సుప్రీంకోర్టులకి వెళ్లి మరీ మొట్టికాయలు వేయించుకోవడం, ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ స్పీకర్ కి లేఖ కూడా రాయడం వంటి విషయాలన్నీఅందరికీ తెలిసిందే. తాజాగా రోజా కొన్ని వెరైటీ వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ వలె తాను ప్యాకేజీలు పుచ్చుకోలేదని, తాను ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడటంలో భాగంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ అయినందుకు చాలా గర్వంగా ఉందంటూ వెల్లడించింది. ఇంకా తాను ప్రభుత్వంతో నిరంతరం రాజీలేని పోరాటం చేస్తానని వివరించింది.
రోజా ఇంకా మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ వలె ప్యాకేజీకి ఒప్పుకోక పోవడం వల్లనే తాను సస్పెండ్ అయినట్లు చెప్పడంలోని అంతరార్ధం చాలా ఆలోచనకు దారితీసేలా ఉంది. గత కొంతకాలంగా రోజాని తెదేపాలోకి లాగేందుకు అధికార పార్టీ సన్నాహాలు ముమ్మరంగా చేసినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమే స్వయంగా ఖండించింది కూడాను. తెదేపా నేతలు కావాలని వైకాపా నుంచి తనను దూరం చేసేందుకే మైండ్ గేమ్ ఆడుతున్నట్లు రోజా విరుచుకుపడింది. ఇంకా రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపాను వదలనని స్పష్టం చేసింది. కాగా రోజా అప్పట్లో అలా ఖండించి, ఇప్పుడు తెదేపా తనకు ప్యాకేజీ ఎరవేసినా లొంగకపోవడం కారణంగానే తాను ఇలా సస్పెండ్ అయ్యానని చెప్పడం విడ్డూరంగా ఉంది, ఏ విషయాన్నైనా చాలా లైట్ గా తీసుకొనే రోజా, పవన్ ఘాటు మాటలకు ఇంతలా మదన పడటం ఎందుకంటారు..?