ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ముద్రగడ ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో ఈనెల 11న ఆయన రాజమండ్రిలోని కాపు నేతలతో సమావేశం కానున్నాడు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను తీసుకొని తమ భవిష్య కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రగడ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ముద్రగడ తిరిగి ఉద్యమానికి సిద్దం అవుతున్న సమయంలో సిఐడి పోలీసులు తుని విధ్వంసం కేసులో 20మందికి నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. ఇది నిజంగా ప్రభుత్వం కాపు ఉద్యమాన్ని అణచి వేయడంలో భాగంగా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతుందా అన్న అనుమానాలకు తావిస్తుంది. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమకు అనుకూలమైన మైలేజ్ కోసం ఆయా పార్టీలు కొన్ని ఘనకార్యాలు చేస్తుంటాయి. అది వేరే విషయం కాని ఇప్పుడు ముద్రగడ గొంతు నొక్కడానికో లేక ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికో గానీ ప్రభుత్వం కుతంత్రానికి పూనుకుంటే ముద్రగడ కాస్త తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందులో భాగంగానే ఈ మధ్య చాలా చలాకీగా, హుషారుగా, ఎంతో హుందాతనంతో ముద్రగడ అటు రాజకీయ, సినీ ప్రముఖులను, పెద్దవారిని కలవడం, కాపు రిజర్వేషన్లపై తాము చేస్తున్న పోరాటం గురించి చెప్పడం వంటివన్నీ జరిగినవి. అలా కాపు ప్రముఖులదరి మద్దతు కూడగట్టుకొని ముద్రగడ మంచి ఎత్తుగడలోనే ఉన్నట్లుగా అర్ధమౌతుంది. ఒకవేళ ఇలా సిఐడి నోటీసులు ఇచ్చిన వారిని కాని అరెస్ట్ చేస్తే, అప్పుడు మళ్ళీ వారిని విడిపించేందుకు ముద్రగడ మరో ఉద్యమాన్ని చేపడితే నిజంగా ఉద్యమం పక్కదారి పడుతుంది. ఇది ఒక రకంగా ప్రభుత్వం ఎత్తుగడలో భాగమే. కానీ కాపు ఉద్యమమన్న ప్రతి సారి తుని ఘటనలో అనుమానితులు అరెస్టు అనే చందంగా గాని మారితే కాపు ఉద్యమ పరిస్థితి ఏంటనేది ఆలోచించాల్సిన విషయం. కానీ ఈ రకంగా ప్రభుత్వం పన్నిన ఉచ్చులో చిక్కుకోకుండా ముద్రగడ కాపు ఉద్యమం ని ఎలా ముందుకు తీసుకువెళతాడో..చూద్దాం.