జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా జరిగిన సభలో ఏపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభ సాక్షిగా తాను మొదటి సభను తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో నిర్వహిస్తానని కూడా వెల్లడించాడు. కాగా ఈ సభకు సంబంధించి ఏర్పాట్లను, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 9వ తేదీన ఈ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ‘సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ’గా నామకరణం కూడా చేసినట్లు వెల్లడించారు.
ఈ సభకు సంబంధించిన విషయాలను పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన ద్వారా వివరించాడు. అదేమంటే కాకినాడలోని జేఎన్టీయు క్రీడామైదానంలో సెప్టెంబర్ 9 సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమౌతుందని వెల్లడించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం తాను మూడంచెల పోరాటం చేస్తానని వెల్లడించాడు. తిరుపతిలో జరిగిన వేదిక సాక్షిగా ప్రత్యేక హోదా విషయంపై పవన్ అన్ని రాజకీయ పార్టీలను దులిపేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక రేగింది. కేంద్రం నుండి కూడా అప్పుడే ప్రత్యేక హోదాకాదని ప్యాకేజీనే ఇస్తామన్న అభిప్రాయాన్నే దాదాపు ఖరారు చేసినట్లు చెప్పకనే చెప్పించింది. కాబట్టి ఈ సందర్భంలో సభ జరపాలా..? వద్దా..? అన్న తర్జనభర్జనలో పవన్ కళ్యాణ్ కాకినాడ సభ యధాతధంగా నిర్వహించడం కూడా ఖరారైంది. ఆలోపు కేంద్రం ప్రత్యేక హోదాకి బదులు, ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినట్లయితే, అందుకోసమే కాచుకు కూర్చున్న రాష్ట్ర ప్రభుత్వం అది పుచ్చుకొన్నట్లయితే అప్పుడు కాకినాడ సభలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగ స్పందిస్తాడో చూడాలి. కాగా ముద్రగడ విషయంలో కాపుల దృష్టి పవన్ ఉద్యమానికి ఎంతవరకు సహకరిస్తుందో కూడా చూడాలి. ఇటువంటి క్లిష్టమైన సిచ్యుయేషన్ లో, ఇన్ని సవాళ్ళ మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం, తను చేపట్టే ఉద్యమం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.