చిన్న చిత్రాల్ని తీసి పెద్ద విజయాల్ని సొంతం చేసుకోవడంలో నాగార్జునకి తిరుగులేదు. `సీతారాముల కళ్యాణం చూతము రారండి` మొదలుకొని `ఉయ్యాలా జంపాలా` వరకు ఆయన నిర్మాణంలో పలు చిన్న చిత్రాలొచ్చాయి. ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాని నిర్మించాడు. అందులో నాగ్ ఓ గెస్ట్ రోల్‌లో కూడా కనిపిస్తాడని ప్రచారం సాగింది. కానీ నాగార్జున మాత్రం `సినిమాలో నాది గెస్ట్ రోల్ కాదు, ఫుల్ లెంగ్త్ రోల్` అని తేల్చిచెప్పాడు. సినిమా మొత్తం కనిపిస్తాననీ, నా కెరీర్‌లో అదొక మంచి సినిమా అవుతుందని స్పష్టం చేశాడు. నాగ్ ఫుల్ లెంగ్త్ రోల్ అనేసరికి ఆ చిత్రం స్థాయి మారిపోయింది. ఓ కొత్త ప్రేమభాషతో తెరకెక్కిన చిత్రమని, తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నాగ్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేస్తున్నారు. 8న పాటల్ని విడుదల చేస్తారు. నాగ్ ఈ సినిమా నిర్మాణంలో తన స్నేహితుడైన మ్యాట్రిక్స్ ప్రసాద్‌ని భాగస్వామి చేశారు.