నాని మళ్లీ కొట్టేలాగే ఉన్నాడు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాలు పంచే ఆయన త్వరలోనే `మజ్ను`గా రాబోతున్నాడు. నాని నుంచి సినిమా వస్తోందంటే చాలు... తప్పకుండా ఏదో ఒకటి కొత్తగా ఉంటుందని నమ్మతుంటారు ప్రేక్షకులు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన మజ్ను ట్రైలర్ నాని మరో మంచి సినిమా చేశాడనే భరోసాని కలిగిస్తోంది. అదొక ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. నాని ఒకర్ని ప్రేమిస్తే, ఆయన్ని మరొక అమ్మాయి ప్రేమించే ఓ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రయిలర్‌ని బట్టి తెలుస్తోంది. నాని ఈ సినిమాలో ఓ సహాయ దర్శకుడిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమాలో సినిమా వాతావరణమే కనిపించబోతోంది. చిన్న ట్రయిలర్‌లోనే బోలెడన్నిపంచ్‌లు పేలాయి. ఓ సన్నివేశంలో నాని చెప్పిన కథ విన్నాక వెన్నల కిషోర్ ` నీ కథలో నవరసాలు ఉన్నాయి కానీ భయ్యా... ప్రేమే` అంటాడు. నాని స్పందిస్తూ `ప్రేమ రసం కాదు రా... చట్నీ` అని చెబుతాడు. ఆ డైలాగ్ ట్రయిలర్‌కే హైలెట్‌గా నిలిచింది. అన్నట్టు ఈ ట్రైలర్ రాజమౌళి యాక్షన్ చెప్పడంతోనే మొదలవుతుంది. సినిమాలో రాజమౌళి కూడా ఓ అతిథి పాత్రలో మెరుస్తాడన్న విషయం తెలిసిందే. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేయబోతున్నారని తెలిసింది.