పవన్ ఇక అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తానని కుండబద్దలు కొట్టేశాడు. దానిలో భాగం గానే తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి గొంతెత్తాడు. ఇదే సభలో మళ్ళీ తొందరలోనే కాకినాడలో ఒక సభ నిర్వహిస్తానని పవన్ చెప్పాడు. ఈ నెల 9 న కాకినాడ లో ఈ సభ నిర్వహించడానికి జనసేన కార్య కర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే పవన్ ఈ సభను పెట్టడానికి కారణం ఒక్కటే... అదే ఏపీకి ప్రత్యేక హోదా. మరి పవన్ ఈ ఒక్క విషయం గురించే తిరుపతి సభలో ప్రముఖం గా మాట్లాడాడు. అయితే ఇప్పుడు కేంద్రం ఒక వారం రోజుల్లో ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయం లో పవన్ కాకినాడలో సభను పెట్టి ప్రత్యేక హోదాపై మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచిస్తే మంచిదని అందరూ అనుకుంటున్నారు. మరోపక్క ముద్రగడ సెప్టెంబర్ 11 న కాపు మహా సభను కాకినాడలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీ ఈ నెల 9 కల్లా తన నివేదికని సమర్పించాల్సి వుంది. కానీ ఆ నివేదిక ఇప్పటిదాకా ప్రభుత్వానికి చేరలేదు. ఇంకేముంది ముద్రగడ మళ్ళీ తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయ్యాడు. తనతో పాటు అన్ని పార్టీ కాపునాయకులతో సమావేశాలు చర్చలు ప్రారంభించేసాడు. ఇక సభను పెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు. మరి పవనేమో నాకు కులాన్ని అంటగట్టొద్దు బాబో అంటున్నాడు. అలాంటప్పుడు అటు ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా ఇటు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా పవన్ ఏం చేస్తాడో అని అందరు తెగ చర్చించేసుకుంటున్నారు. మరో పక్క ముద్రగడని సైడ్ ట్రాక్ లో పెట్టేందుకే చంద్రబాబు.. పవన్ సభని ప్లాన్ చేశాడా అనే అనుమానం కూడా చాలామందికి వస్తుంది. అసలు పవన్.. చంద్రబాబు మాట మీద ఈ సభను పెడుతున్నాడా లేక రాజకీయం గా ప్రభుత్వాలను ప్రశ్నించడానికే పెడుతున్నాడా అనేది ఈ నెల 9 వరకు వేచి చూడాల్సిందే.