టాలీవుడ్ హీరో శివాజీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే, హీరోకు రాజకీయాలు ఎందుకనుకోవచ్చు. సినిమాలు చేసి చేసి విసుగు చెంది, ప్రత్యేక హోదా పేరుతో కాస్త హడావుడి అయినా చేసి రాజకీయాల్లోకి జారుకుందామని అలా సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు శివాజి. అందుకోసం తీవ్రంగా, అమిత జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం విడిపోయి ప్రత్యేక ఆంధ్ర ప్రాంతం ఏర్పాటయ్యాక శివాజీ ప్రత్యేక హోదా కోసం తనదైన శైలిలో పోరాటం చేస్తూనే ఉన్నాడు. దీనిపై తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాడు.
ఈ మధ్య ప్రత్యేక హోదా విషయంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్రం ఆవిషయంపై కసరత్తులు చేస్తుందని, ప్యాకేజీకే మెగ్గుచూపుతాము అన్నట్లుగా తెలిపాడు. ఆ మాటలపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. దీనిపై శివాజీ స్పందిస్తూ... ప్రత్యేక హోదాకోసం కాకుండా చంద్రబాబు ప్యాకెజీకేగాని ఒప్పుకుంటే చరిత్ర హీనులుగా మిగిలి పోతాడని, అలాగే గాని జరిగితే నేను మీ ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటానని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకా రాజకీయ నాయకులు మాట ఇచ్చి దానిపై నిలబడరని, నేను అలా కాదు. మీరు ప్యాకెజీకి ఒప్పుకుంటే తాను చచ్చిపోతానంటూ వెల్లడించాడు. అదేంటి శివాజీ అలా మాట్లాడేశావ్ అంటూ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. కాగా సుజనా చౌదరి గురించి మాట్లాడుతూ సుజనాకు బ్యాంక్ స్కాంలపై ఉన్న అవగాహన ప్రత్యేక హోదాపై లేదన్నాడు. ఇంకా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని వివరించాడు.
ఈ విషయంపై తెదేపా ఎంపీలంతా శివాజీపై మండిపడుతున్నారు. తిరుపతి ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ సుజనా చౌదరి కేంద్ర రాష్ట్రాలకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్నాడని వెల్లడించాడు. అయితే మరోసారి సుజనా చౌదరిని అలా అంటే నాలుక కోస్తా అంటూ శివప్రసాద్ హెచ్చరించాడు.