తెలుగు రాష్ట్రాల్లో నయీమ్ జరిపిన ఘన చరిత్రను తవ్వేకొద్ది వెలుగొందుతున్న విషయాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇదో అరుదైన కనీ, వినీ ఎరుగని అసాధారణ విషయానికి చెందిన కేసు. చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే స్టోరి. అదే గ్యాంగ్‌స్టర్ నయీముద్ధీన్ అలియాస్ నయీమ్ స్టోరి. కొందరి గురించి దార్శనికులు కూడా ముందుగానే అంచనా వేస్తారు. వర్మ ఈ విషయాన్ని ముందుగానే చెప్పాడు. నయీమ్ పుట్టినప్పటినుంచి ఎన్‌కౌంటర్ చేసేంతవరకు అతని జీవితాన్ని ఒక సినిమాగా తీయడం చాలా కష్టం అని తెలిపాడు. ఆ మాటల్లోని అంతరార్థం ఇప్పుడు అర్థమౌతుంది. నయీమ్ తో అంటకాగని రాజకీయ నేత లేడంటే ఒట్టు. రాజకీయ నేతలే కాదు, పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, పోలీసులు, మీడియా, సినీ నటీనటులు.. ఒకరేమిటి ఆయన రాసుకున్న డైరీ ద్వారా అన్నీ బైటపడుతున్నాయి. ఈ విషయంలో సిట్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇక్కడో విషయం ఏంటంటే ప్రభుత్వమే చేయించిన ఎన్ కౌంటర్ కాబట్టి ప్రభుత్వం ప్రమేయంతోనే దర్యాప్తు తప్పకుండా కొనసాగుతుందనేదే.
కాగా ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో బయటపడ్డ విషయాలను బట్టి చూస్తే నయీమ్‌పై మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ఇప్పటికే 53 మందిని అరెస్టు చేశారు. ఒక్క శుక్రవారంరోజే అంటే నిన్ననే ఈ కేసులో 10 మంది అరెస్టయ్యారు. వీరినందరినీ కోరుట్ల, భువనగిరి పోలీస్‌స్టేషన్లకు పోలీసులు తరలించారు. నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు వీళ్ళంతా సన్నిహితులని కూడా సిట్ పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. కాగా సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నయీమ్ కోసులో అరెస్ట్ చేసిన వారిలో ఆసిఫ్‌ఖాన్, చిన్నబత్తిని బెంజమిన్, కాసాని ఇంద్రసేనా, గుమ్మడెల్లి మల్లేశ్, కనుకుంట్ల శ్రీకాంత్, రావుల సురేశ్, గడ్డం జంగయ్య, రాకాల శ్రీనివాస్, సందెల ప్రవీణ్‌కుమార్, మహ్మద్ యూనస్ ఉన్నారు. వీళ్ళంతా కిడ్నాప్‌లు, ఆయుధాలతో బెదిరించి బలవంతపు వసూళ్లు, భూ రిజిస్ట్రేషన్లు తదితర నేరాలకు పాల్పడినవారేనని ఆయన అన్నారు.