ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్ ల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. వయసుతో కూడిన నియమాలు పాటించుకోకుండా ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో ఆగకుండా వినకూడని, అనకూడని భాషతో ఇద్దరూ దూర్భాషలాడుకోవడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా కడప జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
కడప జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ వై.ఎస్. జగన్ పెద్ద ఉన్మాది అన్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘ఈ జిల్లాలో ఉన్న ఉన్మాది తన బుద్ధిని ఎప్పుడూ మార్చుకోడు. ప్రతీ అభివృద్ధి పనికీ రాక్షసుడిలా అడ్డుపడుతున్నాడు’ అంటూ జగన్ పై పరోక్షంగా విరుచుకుపడ్డాడు. కాగా చంద్రబాబు ఇంత తీవ్ర స్థాయిలో మాట్లాడటంతో అసలే రాయలసీమ వాసులు అవాక్కయి పోయి చూశారు. ఇదేం మాటలు చంద్రబాబు, వయస్సులో చిన్నవాడైన జగన్ ని చూసి సంయమనంతో, విజ్ఞతతో వ్యవహరించక.. పోయి పోయి కొరివితో తలగోక్కుంటావెందుకు అన్నట్లు ముఖాలు పెట్టారంట అంతా. ఇంకా ఓ రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు ఇలా మాట్లాడటం ఏమాత్రం తగదని విశ్లేషకులు అంటున్నారు.