పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కలిసి వేయించిన ఫ్లెక్సీలు విజయవాడ నగరంలో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడీ ఫ్లెక్సీ వ్యవహారంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. సహజంగా బోండా ఉమా పవర్ స్టార్ వీరాభిమాని. పైగా ఒకే కులం కావడంతో ఎలాగూ ఎన్నికల్లో సైతం తమ పార్టీవైపు తీవ్రంగా ప్రచారంలో కూడా పాల్గొన్నాడు కాబట్టి ఏం కాదన్న దృక్పధంతో ఈ ఫ్లెక్సీలు చేయించినట్టుంది బోండా ఉమామహేశ్వరరావు. కానీ ఇక్కడే వచ్చింది ఇబ్బంది. ఈ ఫ్లెక్సీలలో టీడీపీ గుర్తుగానీ, సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో కానీ లేకపోవడంతో ఆ పార్టీ నాయకులకు తెగ మండిపోతుంది. కేవలం పవన్ కళ్యాణ్, బోండా ఉమా పోటోలు మాత్రమే ఉండటంతో తెలుగు దేశం పార్టీ నాయకులంతా కాస్త గుర్రుగా ఉన్నారని సమాచారం.
కాగా ఈ మధ్యనే తిరుపతిలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెదేపా ఎంపీలను ప్రధానంగా విమర్శించిన విషయం తెలిసిందే. దాంతో చెలరేగిన ప్రత్యేక హోదా తంటా ఇంకా నడుస్తూనే ఉంది. ఆ తర్వాత పవన్ పై టీజీ వెంకటేష్ కూడా కాస్త ఘాటుగానే విరుచుకు పడ్డాడు. దానికి బోండా ఉమా టీజీపై ఫైర్ అయ్యాడు కూడాను. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆంధ్రాలో భాజపా తెదేపాకు ఈ మధ్య జరిగిన గొడవల విషయంలో బోండా మాత్రం పవన్ వైపు మాత్రమే ఉన్నాడు. కాగా ఇప్పుడు ఈ ఫ్లెక్సీల హడావుడి జరగడంతో పార్టీ ఎటూ పోతుంది అన్న విషయంపై కూడా తెదేపా నాయకులు తర్జన భర్జనలు పడుతుంది. చూద్దాం ఈ చిన్న అంశం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.