ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రవితేజ ఈమధ్య బాగా జోరు తగ్గించాడు. బెంగాల్ టైగర్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినప్పటికీ ఆయన బండి మాత్రం వేగం పుంజుకోలేదు. అందుకు కారణం కథలే. దమ్మున్న కథల్నే ఎంచుకొని వరుసగా హిట్లు కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు రవితేజ. అందుకే ఒక పట్టాన ఆయన కథల్ని ఒప్పుకోవడం లేదు. మధ్యలో దిల్‌రాజు కాంపౌండ్‌లో రెడీ అయిన ఓ కథ రవితేజకి నచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కొత్త దర్శకులు తెచ్చిన రెండు మూడు కథలు కూడా విన్నాడు రవితేజ. కానీ అవి కూడా ఆయనకి ఎందుకో నచ్చలేదట. దీంతో తనకి `పవర్`రూపంలో హిట్టిచ్చిన బాబీని స్వయంగా రంగంలోకి దించాడు రవితేజ. ఇటీవలే బాబీ ఓ స్క్రిప్టుని ఓకే చేసినట్టు సమాచారం. కోన వెంకట్ కాంపౌండ్‌లో తయారయిన ఆ కథని తనదైన శైలిలో తీర్చిదిద్దాడట బాబీ. అది రవితేజకి బాగా నచ్చడంతో త్వరలోనే పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరి నుంచి షూటింగ్ మొదలవుతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు కథతోనే తెరకెక్కబోతున్న ఆ సినిమాకి క్రాక్ అనే పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. క్రాక్‌గా వ్యవహరించే పోలీసు పాత్రతో తెరకెక్కుతున్న కథ కావడంతోనే ఆ పేరును ఫిక్స్ చేసినట్టు సమాచారం.