చిన్న సినిమాగా విడుదలై బారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం పెళ్ళి చూపులు. ఈ చిత్రం ఇంకా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుండటం విశేషం. కదిలించే కథాంశంతో చిక్కని కథనంతో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మాతగా తెరకెక్కిన అద్భుత చిత్రం పెళ్ళి చూపులు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కడు చిన్న బడ్జెట్ లో చాలా గొప్ప సినిమా తీసినందుకు చిత్ర బృందాన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఇప్పుడు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఈ సినిమాను చూసి తెగ పొంగి పోయాడు.
మాజీ క్రికెటర్ అజరుద్దీన్ మాట్లాడుతూ.. 'చాలా కాలం నుండి మా కుమారుడు అబ్బాస్ (అసద్) తెలుగులో వచ్చిన పెళ్లి చూపులు సినిమాను చూడమని కోరుతున్నాడు. చూడమనడం కూడా కాదు, చూడమని చాలా వత్తిడి చేశాడు. నేను అప్పటి నుండి చూద్దామనుకుంటున్నాను. కానీ అది ఇప్పటికి కలిసొచ్చింది. పెళ్ళి చూపులు సినిమా చాలా బాగుంది. చాలా కాలం తర్వాత అంటే సుమారు 23 యేళ్ళ తర్వాత నేను ఓ తెలుగు సినిమాను చూశాను. అది పెళ్ళి చూపులు సినిమానే. ఇది నాకు బాగా నచ్చింది' అన్నాడు అజరుద్దీన్. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను నిర్మాత రాజ్ కందుకూరును ప్రత్యేకంగా అభినందించాడు.
కాగా చివరగా అజరుద్దీన్ మాట్లాడుతూ... తాను వైజాగ్ లో ఇవివి సత్యనారాయణ తీసిన 'జంబలకిడి పంబ' చిత్రాన్ని చూశానని, అప్పటి నుండి తెలుగు సినిమా అస్సలు చూడలేదని తెలిపాడు. ఇంకా తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చని కూడా వివరించాడు.