జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్-2. అయితే పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు నాడు ఎలాంటి హంగూ, ఆర్భాటాలు చేపట్టరాదని అభిమానులకు సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనగానే తెలుగురాష్ట్రాల్లోని అభిమానులంతా కటౌట్లు, ఫ్లెక్సీలు, కేక్ కటింగ్స్ అంటూ నానా హంగామా సృష్టిస్తారు. ఇవన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ముందుగానే తన అభిమానులకు హెచ్చరికలు జారీ చేస్తూ.. అభిమానం అనేది మనసులో ఉండాలిగాని ఇలాంటి కార్యక్రమాల ద్వారా బయటికి ప్రకటించాల్సిన అవసరం లేదని వెల్లడించాడు.
కాగా ఈ మధ్య పవర్ స్టార్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సవాళ్ళు విసిరాడు. జనసేనానిగా ఇక ప్రత్యేక హోదా నిమిత్తం ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమించాలని కూడా తీర్మాణించుకొన్నాడు పవన్ కళ్యాణ్. ఈ నేపధ్యంలో తన పుట్టిన రోజునాడు ఎలాంటి ఆర్భాటాలకు తావు ఉండకూడదనీ, సేవా కార్యక్రమాలు వంటివి నిర్వహించుకోవచ్చునన్న సంకేతాలను ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సెప్టెంబర్ రెండవ తేదీనాడు సినిమా- రాజకీయ ప్రముఖులకు దూరంగా ఉంటున్నట్లుగా వెల్లడించినట్లు కూడా వార్తలొస్తున్నాయి. కాగా ప్రత్యేక హోదా కోసం చేపట్టే ఉద్యమానికి కసరత్తులు మొదలయ్యాయనే చెప్పవచ్చు.