ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కె.రోశయ్యను అర్ధాంతరంగా దింపివేసిన కాంగ్రెస్ పార్టీ పోనీలే అన్నట్లు తమిళనాడుకు గవర్నర్ ను చేసింది. అక్కడ కె.రోశయ్య తమ పదవే లక్ష్యంగా పార్టీని సైతం పక్కన బెట్టి రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలతో అనుకూలంగా మలుచుకున్నాడు. కాగా అందరూ.. ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు కదా తిరిగి రోశయ్యనే గవర్నర్ పదవిలో కొనసాగించవచ్చని భావించారు. కాగా ఇంతలో కేంద్రప్రభుత్వం రోశయ్యకు షాక్ ఇచ్చింది. రోశయ్యకు తమిళనాడు గవర్నర్ పదవి బుధవారంతో ముగియడంతో మరోమాట లేకుండా కేంద్రం మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న సి.హెచ్. విద్యాసాగర్ రావుకి అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో తమిళనాడుకి మరో కొత్త గవర్నర్ ని నియమించేంతవరకు విద్యాసాగర్ రావు ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు.
కాగా ఈ విషయంపై చాలా కాలం నుండి కె.రోశయ్య తన పదవిని పొడిగించుకొనేందుకు సర్వప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రోశయ్య అటు రాష్ట్ర అధినాయకురాలుతోపాటు కేంద్రంతో కూడా అనుకూల సంబంధాలు నెరుపుతుండటంతో పొడిగించేందుకు మార్గం సుగమం అయిందని భావించారు. ఓ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఇప్పటివరకు ఉంచడమే ఎక్కువని, ఇంతవరకు ఉంచారంటే ఆయన నెరపిన సంబంధాలే కారణం అని కూడా సమాచారం అందుతుంది. ఉన్నట్టుండి రాష్ట్రపతి భవన్ నుండి విద్యాసాగర్ రావుకు తమిళనాడు గవర్నర్ కు సంబంధించిన అదనపు బాధ్యతలు అప్పగించడంతో రోశయ్య కూడా కొంత నిరాశకు లోనైనట్లుగా తెలుస్తుంది.