సినీనటి, కర్ణాటక కాంగ్రెస్ నాయకురాలు రమ్య మరోసారి భాజపాపై విరుచుకు పడింది. ‘పాకిస్తాన్ నరకం కాదు అక్కడి జనాలకూ మానవత్వం ఉంది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు తీవ్ర దుమారం రేగుతుంది. దాంతో చెలరేగిన వివాదం చల్లారకముందే నటి రమ్య మరోసారి భాజపాపై విరుచుకు పడింది. అస్సలు దేశానికి స్వాతంత్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటాల కారణంగానే అని, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళ వల్ల కాదని ఆమె తెగేసి చెప్పింది. ఇంకా రమ్య విచిత్రంగా మాట్లాడింది. భాజపా వాళ్ళు దేశ స్వాతంత్యం కోసం పోరాడక పోగా బ్రిటిషర్స్ తో కలిసిపోయారని మండిపడింది. కాగా సినీ నటి రమ్య మండ్య పట్టణంలో భారత రాష్ట్రీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడింది. కాగా రమ్య వరుసగా అధికార పార్టీ భాజపాపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై నాయకులకు పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్ర కాంగ్రెస్ పార్టీనే కావాలని రాష్ట్రానికి ఒకరిని ఇలా భాజపాపై విరుచుకు పడేందుకు, నిరంతరం వారిపై పోరాడేందుకు నియమించిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూడబోతే రమ్య కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా మారనున్నట్లు తెలుస్తోంది.
అయితే రమ్య విద్యార్థులతో కలిసి జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్ నుంచి సర్.ఎం.విశ్వేశ్వరయ్య సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నది. ఆ ర్యాలీలో 3,500 అడుగుల పొడవైన జాతీయజెండా ప్రదర్శన జరిగింది. కాగా ఎంతైనా సినీ నటి కదా అని రమ్యతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు ఎగబడ్డారు.