ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాన్ని చమటలు పోయిస్తున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం కొన్ని నెలలుగా తీవ్రంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ముద్రగడ కాపు రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వంపై పలు రీతులుగా ఉద్యమాలు చేస్తునాడు. అలా ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి కాపు రిజర్వేషన్లను సాధించాలని ముద్రగడ ప్రణాళికలు వేస్తున్నాడు. కాగా ఆ మధ్య వరుసగా కాపు నాయకులు చిరంజీవి మొదలుకొని, దాసరి వరకు ఇంకా పలుగురు రాజకీయ ప్రముఖులు కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు. కాగా అప్పట్లో ముద్రగడకు జగన్ తన రాజకీయ మనుగడ కోసం పరోక్షంగా మద్దతు తెలిపాడని సమాచారం. ప్రస్తుతం ముద్రగడ తన ఉద్యమానికి మద్దతును కూడకట్టుకునే పనిలో తలమునకలై ఉన్నాడు. అందరినీ కలుస్తూ తన ఉద్యమ కార్యాచరణను తెలుపుతూ ఎలా ముందుకు వెళ్ళాలో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ముద్రగడ ఎపిసోడ్ లో దాసరి నారాయణరావు పాత్ర కీలకంగా మారింది. ఉద్యమం మొదటి నుంచి కూడా దాసరి, ముద్రగడకు తన ఉద్యమాల సమయంలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు.
తాజాగా అందిన సమాచారాన్ని బట్టి ముద్రగడకు, దాసరి మద్దతు విషయంలో చాలా దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలు దాగున్నాయనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంతకు ముందునుండి కూడా దాసరి రాజకీయంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాసరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అంటుకున్న బొగ్గు మచ్చ ఆయన పలు రకాల మానసిక వత్తిడికి, పరువు ప్రతిష్ఠలకు భంగకరంగా తయారైంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బయటపడ్డ ఈ కుంభకోణం విషయంలో, కాంగ్రెస్ పార్టీ నుండే ఆయనకు మద్దతు కరువైంది. పార్టీపరంగా ఎటువంటి సహాయ సహకారాలు లభించకపోగా పార్టీ తనను క్షణక్షణం వేదనకు గురి చేసినట్లుగానే దాసరి భావిస్తున్నాడు. ఒక రకంగా బొగ్గు కుంభకోణం ఆయన రాజకీయ భవిష్యత్ నే ఇబ్బందుల పాలు చేసింది. కాగా ముద్రగడ చేపట్టిన కాపు ఉద్యమంలో దాసరి రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్నాడు. ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం తాలూకూ పట్టుకోసం తన రాజకీయ జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా కాపు రిజర్వేషన్ల విషయంలో దాసరి ప్రజల మెప్పును పొందితే రాజకీయంగా ఓ వెలుగు వెలగవచ్చు. అందుకే ముద్రగడతో దాసరి ఈ మధ్య అధికంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.